Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్

Gautam Gambhir Criticism

Gautam Gambhir Criticism

Gautam Gambhir Sends Strong Message to Team India: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లకు కీలక సందేశం ఇచ్చాడు. భారత జట్టు ప్రతి సవాల్‌కు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని.. తొలి రోజు నుంచే అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించాడు. ప్రస్తుతం భారత జట్టు కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో ప్రాక్టీస్ సెషన్ నిర్వహిస్తోంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు ఇదే వేదికలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం గాలేకు వెళ్లనున్న టీమిండియా.. ఆగస్టు 15న తొలి టెస్టులో శ్రీలంకతో తలపడుతుంది.

టెస్టు సిరీస్‌ సందర్భంగా బీసీసీఐ టీవీలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘మన ముందున్న సవాలు ఏమిటో అందరికీ తెలుసు. మనం దేనికోసం పోరాడుతున్నామో కూడా తెలుసు. అందరూ బాగా శ్రమించాలి. గతంలో కంటే ఎక్కువగా కష్టపడాలి. ప్రతి అంశంలో సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 15 ఉదయం బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా.. ప్రత్యర్థి విసిరే ప్రతి సవాలుకు మన దగ్గర సమాధానం ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే అన్ని విషయాల్లో బాగా సిద్ధం కావాలి’ అని ఆటగాళ్లకు పిలుపునిచ్చాడు.

భారత టెస్టు జట్టులో కొత్తగా చోటు దక్కించుకున్న ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, యువ పేసర్ ఆకిబ్ నబీకి గంభీర్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు. అలాగే కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్‌కు కూడా జట్టులోకి స్వాగతం పలికాడు. ‘సారాంశ్.. ఇక్కడి వరకు రావడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. అవకాశం వచ్చినప్పుడు నీ కుటుంబంతో పాటు దేశానికి కూడా గర్వకారణంగా నిలవాలి. ఆకిబ్.. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశావు. జమ్మూ కశ్మీర్‌కు రంజీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించావు. నీకు అభినందనలు. అలాగే శుభదీప్ ఘోష్‌కు కూడా స్వాగతం. ఎన్నో జట్లతో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన అనుభవం, అంకితభావం, ఉత్సాహం ఈ జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతున్నాను’ అని గంభీర్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. అయితే శ్రీలంక గడ్డపై భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు చిన్నవి కావు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ ఇచ్చిన సందేశం టీమిండియా ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపేలా కనిపిస్తోంది.