Gautam Gambhir on Sanju Samson Dropped: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. సంజు రెండో, మూడో టీ20లో 57, 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే శాంసన్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇవ్వగా.. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ కేరళ బ్యాటర్ నిరూపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని వెల్లడించాడు.
ప్రతిభ లేదని ఎలా అనగలం?
‘సంజు శాంసన్‌కు అవకాశం ఇచ్చినందుకు నాకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు. అతని ప్రతిభే అతడిని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండేందుకు అర్హుడిని చేస్తుంది. సంజు ఏం చేయగలడో ఇప్పటికే చూపించాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిభ లేదని ఎలా అనగలం?. సంజు ఇప్పటికే ఎంతో సాధించాడు’ అని గంభీర్ ప్రశంసించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ తర్వాత శాంసన్‌ను పక్కన పెట్టారు. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. అయితే మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చివరి మ్యాచ్‌కు అతడిని కూడా పక్కన పెట్టి.. మరలా శాంసన్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకున్నారు.
అది కఠినమైన నిర్ణయం:
సంజు శాంసన్‌ను ఇంగ్లండ్ సిరీస్‌లో పక్కన పెట్టడం అంత సులభమైన నిర్ణయం కాదని గౌతమ్ గంభీర్ చెప్పాడు. ‘సంజును ప్లేయింగ్ 11 తప్పించడం చాలా కఠినమైన నిర్ణయం. నా కోచింగ్ కెరీర్‌లోనే నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం బహుశా అదే. అంతకుముందు సంజు ప్రదర్శించిన తీరు కూడా అందుకు కారణం. అయితే కొన్నిసార్లు ఆటగాళ్ల ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో సంజు చాలా బాధపడి ఉంటాడు’ అని వివరించాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ జట్టులో అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్‌లో ఆడిన కాంబినేషన్‌నే ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో కొనసాగించాలని ముందుగానే నిర్ణయించుకున్నామని తెలిపాడు.
చెడ్డ ఆటగాళ్లుగా మారిపోరు:
‘మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ప్రపంచ కప్ ఆడిన ప్లేయర్స్ చెడ్డ ఆటగాళ్లుగా మారిపోరు. ఒక ప్రపంచ కప్ నుంచి మరో ప్రపంచ కప్ వరకు ఓటమి లేకుండా ప్రయాణించి.. ఒకటి రెండు సిరీస్‌లలో విఫలమైనంత మాత్రం ఒక్కసారిగా చెడ్డ జట్టుగా మారదు. రెండు మూడు మ్యాచ్‌ల వైఫల్యాలతో ఆటగాళ్లు తమ ప్రతిభను కోల్పోరు. వైభవ్‌తో కూడా మేము చాలా స్పష్టంగా మాట్లాడాం. అతను తన అవకాశం కోసం వేచి ఉండాలి. అతనిలో ఎలాంటి ప్రతిభ ఉందో, అతను ఏం చేయగలడో మాకు తెలుసు’ అని గంభీర్ చెప్పాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించడం ద్వారా శాంసన్ తనపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ఏషియన్ గేమ్స్ 2026లో సంజునే ఓపెనింగ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బుడ్డోడికి మరలా అవకాశం ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

