NTV Telugu Site icon

Rishabh Pant: ఎంత పని చేశావ్ పంత్.. రివర్స్ స్వీప్ షాట్‌పై మాజీలు ఫైర్

Rishabh Pant

Rishabh Pant

Gambhir Ravi Shastri Wasim Akram Reacts On Rishabh Pant Shot: ఒకసారి వర్కౌట్ అయిన ట్రిక్.. ప్రతీసారి వర్కౌట్ అవ్వాలని లేదు. పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పావులు కదపాలి. కాదు, కూడదు అని రెచ్చిపోతే మాత్రం.. తేడా కొట్టి, అందుకు భారీ మూల్యం చెల్లించుకోలేక తప్పదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే రిషభ్ పంత్‌కి వచ్చింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆచితూచి ఆడాల్సిన పంత్.. ఆవేవంతో రివర్స్ స్వీప్ ఆడి ఔటవ్వడం వల్ల అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రిషభ్ ఆ షాట్ జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని, ఎందుకు ఆ షాట్ కొట్టావంటూ అతడ్ని నిలదీస్తున్నారు.

‘‘రివర్స్ స్వీప్ అనేది పంత్ బలం కానే కాదు. లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెడ్ మీదుగా అతడు మంచి షాట్స్ ఆడుతాడు. అతడి బలం కూడా అదే. అప్పుడప్పుడు రివర్స్ స్వీప్ వర్కౌట్ అయ్యాయి కానీ, అది మాత్రం రిషభ్ బలం కానే కాదు. కాబట్టి, అతడు ఔటైనప్పుడు కచ్ఛితంగా నిరాశకు గురై ఉంటాడు’’ అంటూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. పాక్ మాజీ కెప్టెన్ అక్రమ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ‘‘అది అత్యంత కీలకమైన మ్యాచ్, పైగా కీలక సమయం. అలాంటప్పుడు రివర్స్ స్వీప్ షాట్ ఆడి ఉండాల్సింది కాదు. టెస్టుల్లో కూడా రిషభ్ రివర్స్ స్వీప్ చేస్తాడు కానీ, కీలక దశలో మాత్రం అలాంటి షాట్స్ జోలికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నాడు.

ఇక భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. మైదానంలో దిగడానికి ముందు ఓపెనర్లు రోహిత్, రాహుల్ మైదానంలో ఎటువైపు పరుగులు సాధించారో ఓసారి రిషభ్ పంత్ గమనించి ఉండాల్సిందన్నారు. వాళ్లిద్దరు ఎక్కువగా వికెట్‌కు రెండువైపులా షాట్స్ ఆడారని, బంతి చక్కగా బ్యాట్ మీదకి వస్తోందని తెలిపారు. అలాంటి స్థితిలో పంత్ భారీ షాట్లు ఆడగలడని, బంతిని సరిగ్గా కొడితే ఎంత పెద్ద మైదానమైనా పంత్‌కు లెక్క కాదని పేర్కొన్నారు. కానీ, పంత్ అనవసరమైన షాట్ జోలికి వెళ్లి వికెట్ కోల్పోయాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.