Site icon NTV Telugu

టీమిండియా క్రికెటర్లకు షాక్.. ఈసారి ప్రత్యేక విమానాల్లేవ్..!!

త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది.

Read Also: ఐపీఎల్-15కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం?

స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా అహ్మదాబాద్‌ వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌ చేరుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. వన్డే జట్టుకు ఎంపికైన క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం లేదని, ఎవరికివారుగా సాధారణ విమానాలలో అహ్మదాబాద్‌కు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌ ఆడేందుకు ప్రత్యేకంగా ఛార్టెడ్ విమానంలో క్రికెటర్లను కోల్‌కతాకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ నగరాల నుంచి ఛార్టెడ్ విమానంలో ఆటగాళ్లను తీసుకువచ్చి ముంబైలో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ఏడాది అలాంటి ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version