Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్‌లో రాపిడ్, బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహించనున్నారు.
ఆదివారం రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి, నల్ల పావులతో బరిలోకి దిగిన దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 41 ఎత్తులపాటు ఉత్కంఠభరితంగా జరిగిన గేమ్‌లో విజయం సాధించే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు ఒప్పుకున్నారు.
గేమ్ ఆరంభంలో దివ్య దేశ్‌ముఖ్ క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్‌తో దూకుడు ప్రదర్శించింది. 14వ ఎత్తులో బిషప్‌ను త్యాగం చేసి అడ్వాంటేజ్ సాధించింది. ఈ సమయంలో గెలిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డ హంపి, 16వ ఎత్తు నుంచి తన ఆటలో పుంజుకుంది.
37వ ఎత్తులో దివ్య దేశ్‌ముఖ్ హంపి రూక్‌ను గెలుచుకున్నా, హంపి పట్టుదలతో ఆడి 41వ ఎత్తులో పర్పెచువల్ చెక్స్‌తో గేమ్‌ను డ్రాగా ముగించింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ పోరాటంలో ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిని చాకచక్యంగా ఎదుర్కొన్నారు.
ఇప్పటివరకు రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో, సోమవారం జరగనున్న టై-బ్రేకర్ మ్యాచ్‌ల్లో గెలిచే ఆటగాడికే ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్ దక్కనుంది.
