Site icon NTV Telugu

T20 World Cup: అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు.. టీమిండియాకు కలిసొచ్చేనా..?

England Worst Record

England Worst Record

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి సెమీఫైనల్ పోరు ప్రారంభం కానుంది. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి. గురువారం అడిలైడ్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో అడిలైడ్ వేదికగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడింది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాత్రం ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అడిలై‌డ్‌లో పరిస్థితులపై టీమిండియాకు అవగాహన ఉండే అవకాశం ఉంది. మరోవైపు అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉండటం కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అడిలైడ్‌ ఓవల్‌లో భారత్, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ తలపడలేదు. ఈ మైదానంలో 17 వన్డేలు ఆడిన ఇంగ్లండ్ జట్టు కేవలం 4 మ్యాచ్‌‌ల్లోనే గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడింది. అటు ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. అది కూడా 2011లోనే కావడం గమనార్హం. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. టీమిండియా మాత్రం అడిలైడ్ మైదానంలో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడగా రెండింట్లో విజయం సాధించింది. 2016లో ఆస్ట్రేలియాపై 37 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో గెలిచింది.

Read Also: T20 World Cup: మెగా టోర్నీ ఫైనల్‌పై డివిలియర్స్ జోస్యం.. ఆ రెండు జట్ల మధ్యే తుదిపోరు

కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్‌ కోసం ప్రత్యేకంగా పిచ్ రెడీ చేయడం లేదు. ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌పైనే రెండో సెమీస్ నిర్వహించబోతున్నారు. బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌నే సెమీఫైనల్‌కు వాడనున్నారు. దాంతో టాస్ కీలకం కానుంది. ఈ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడం కలిసి వస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version