మరో 25 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే మెగా లీగ్ ఆరంభానికి ముందే కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. భారీ అంచనాలతో కొనుగోలు చేసిన స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. చాలా కాలంగా కరోనా కారణంగా బయోబబుల్‌లో గడుపుతున్నానని, దీంతో ఒత్తిడి పెరిగిందని.. అందుకే ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయ్ తెలిపాడు. అయితే రాయ్ తప్పుకోవడంతో గుజరాత్ జట్టుకు ఓపెనర్ సమస్య మొదలుకానుంది. ఒకరకంగా చెప్పాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బతికిపోయిందనే చెప్పాలి.
ఎందుకంటే గత సీజన్‌లో తమ జట్టుకే ఆడిన జాసన్ రాయ్‌ను ఈ సారి సన్‌రైజర్స్ టీమ్ రిటైన్ చేసుకోలేదు. అలాగే మెగా వేలంలోనూ అతని కోసం ప్రయత్నించలేదు. జాసన్ రాయ్ ఫిట్‌నెస్ గురించి తెలిసే సన్‌రైజర్స్ హైదరాబాద్ కావ్య మారన్ అతడిని కొనుగోలు చేయలేదని టాక్ నడుస్తోంది. ఏదేమైనా మెగా వేలంలో జాసన్ రాయ్‌ను కొనుగోలు చేయకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి పని చేసిందని అభిమానులు అంటున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన జాసన్ రాయ్ 29 సగటుతో 329 పరుగులు చేశాడు.
