నాటింగ్ హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (18), జాసన్ రాయ్ (27) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైనా డేవిడ్ మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్ తలో వికెట్ సాధించారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్‌ను ఇంగ్లండ్ బ్యాటర్లు చితక్కొటేశారు. మాలిక్ నాలుగు ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్నాడు.
Read Also: Tata Nexon: ఎస్‌యూవీ కార్ల అమ్మకాల్లో మరోసారి టాప్ ప్లేస్
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులు చేసింది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలవడంతో భువనేశ్వర్, బుమ్రా, చాహల్, హార్డిక్ పాండ్యాల స్థానంలో అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్, శ్రేయాస్ అయ్యర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులను చేసింది. పార్కిన్సన్, సామ్ కరణ్ స్థానంలో రీస్ టోప్లీ, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.