NTV Telugu Site icon

BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ben Stokes Interview

Ben Stokes Interview

England Captain Ben Stokes react on BuzBall Cricket vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ 2023 ( Ashes 2023)లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్‌కు ఆసీస్ భారీ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్‌ ఓటమిపై స్టోక్స్‌ తనదైన శైలిలో స్పందించాడు. తొలి మ్యాచ్ గెలిచిన కమిన్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధ ఉన్నా.. బజ్‌బాల్‌ క్రికెట్‌ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ అనంతరం ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ… ‘తొలి టెస్ట్ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది. ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. టెస్టు మొత్తం అభిమానులను కుర్చీల్లో కూర్చోనీయకుండా చేయడంలో మేం విజయవంతం అయ్యాం. ఇలా ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు జరగడంతోనే.. టెస్టు క్రికెట్‌కు, యాషెస్‌ సిరీస్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తొలి టెస్టులో ఓటమి బాధించింది. అయితే మేం మాత్రం బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గము. మున్ముందు కూడా ఇదే ఆటను ప్రదర్శిస్తాం. దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాకు కఠిన సవాల్‌ విసురుతాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సరైనదిగానే భావిస్తాం’ అని అన్నాడు.

‘తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్‌ చేయడంపై చాలా మంది విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాపై ఆధిక్యం ప్రదర్శించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. రోజు చివరి 20 నిమిషాల్లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. జో రూట్‌ లేదా జేమ్స్ ఆండర్సన్ వికెట్లు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసు?. ఒకవేళ పడితే మేం అదే స్కోరు వద్ద ఆలౌట్ అయ్యేవాళ్లం. సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్‌ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. మేం ఇంకా చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్‌ అంతా వచ్చే మ్యాచ్‌లపైనే ఉంది’ అని బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు జూన్‌ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్‌ వేదికగా జరగనుంది.

Also Read: Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!

Show comments