Site icon NTV Telugu

Ben Stokes: ఇంగ్లండ్ జట్టుకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

Ben Stokes Retirement

Ben Stokes Retirement

Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి క్రికెటర్లు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు చెప్పిన స్టోక్స్.. మూడు ఫార్మెట్లలో ఆడటం కాస్త శ్రమతో కూడుకుందని పేర్కొన్నాడు. ఇకపై తాను టెస్టులు, టీ20 క్రికెట్ మాత్రమే ఆడతానని స్టోక్స్ వివరించాడు.

Read Also: MarBurg Virus: వెలుగులోకి మరో కొత్త వైరస్.. అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన WHO

ఇప్పటివరకు బెన్ స్టోక్స్ అంతర్జాతీయంగా 104 వన్డేలు ఆడగా 2,919 పరుగులు చేశాడు. అతడి స్ట్రయిక్ రేటు 95.27 శాతం ఉండగా సగటు 39.45గా నమోదైంది. స్టోక్స్ ఖాతాలో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ స్టోక్స్ రాణించాడు. 104 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు గెలవడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఇటీవల టెస్టులకు కెప్టెన్‌గా రూట్ రాజీనామా చేయడంతో బెన్ స్టోక్స్‌ను కెప్టెన్‌గా ఈసీబీ నియమించింది.

Exit mobile version