Double Hat-Trick In Single Over: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ వరుసగా రెండు వికెట్స్ పడగొట్టడం చాలా కష్టం. టీ20ల్లో అయితే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. క్రికెట్‌లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సాధ్యం కాలేదు. అయితే ఓ 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు పడగొట్టాడు. ఓవర్లోని ఆరు బంతులకు ఆరు వికెట్స్ తీశాడు. ఇంగ్లండ్‌లోని ఓ క్లబ్ క్రికెట్‌లో ఈ ఘనత నమోదైంది. ఆ బాలుడు పేరు ‘ఒలివర్ వైట్‌హౌజ్’. పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.
ఇంగ్లండ్‌లోని క్లబ్ బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరఫున ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఆడుతున్నాడు. ఇటీవల కుక్‌హిల్, క్లబ్ బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఓ ఓవర్‌లో ఒలివర్ ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆరుగురు బ్యాటర్లు బోల్డ్ అవ్వడం. దాంతో ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒలివర్ రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇలాంటి ఘనత ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో నమోదు కాలేదు.
Also Read: ODI World Cup 2023: భారత్ గడ్డపై మెగా టోర్నీ.. ప్రపంచ్‌కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్?
ఒలివర్ వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీశాడనే ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్తో ఒలివర్ రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ ట్వీటుకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ ట్వీట్ చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్టార్ క్రికెటర్స్ కూడా ఆ కుర్రాడికి అభినందనలు తెలుపుతున్నారు. ఒలివర్ క్రీడలకు సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన వాడు. ఒలివర్ అమ్మమ్మ యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టైటిల్ గెలిచారు.
ఒలివర్ వైట్‌హౌజ్ సాధించిన ఈ అరుదైన ఫీట్ తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తొలి కెప్టెన్ జేడెన్ లెవిట్ చెప్పాడు. ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ తీయడం చాలా అద్భుతం అని పేర్కొన్నాడు. ఇది ఎంత పెద్ద రికార్డో అతడికి ఇప్పుడు తెలియదన్నాడు. ఒలివర్ వయసులో కాస్త పెద్ద వాడైన తర్వాత గానీ.. తాను సాధించిన ఈ ఘనత ఎంత గొప్పదో గుర్తించలేడని జేడెన్ చెప్పాడు. మొత్తానికి ట్విట్టర్‌లో ఒలివర్ వైట్‌హౌజ్ పేరు చర్చనీయాంశంగా మారింది.
Also Read: OYO Rooms: ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్టే నౌ, పే లేటర్.. సరికొత్త ఫీచర్