Site icon NTV Telugu

Vipraj Nigam: నీ వీడియోను వైరల్ చేస్తా.. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు మహిళ బ్లాక్ మెయిల్!

Vipraj Nigam

Vipraj Nigam

భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో బెదిరింపు, మెసేజులు రావడం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో వేధింపులు ఒకే మొబైల్ నంబర్ నుంచి వచ్చాయి. విప్రజ్ ఆ నంబర్ బ్లాక్ చేసిన తర్వాత.. అనేక అంతర్జాతీయ నంబర్‌ల ద్వారా బెదిరింపులు కొనసాగాయి. తన డిమాండ్లను ఒప్పుకోకుంటే తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. కాల్స్‌లో విప్రజ్ సహా అతని కుటుంబాన్ని బహిరంగంగా అవమానిస్తామని హెచ్చరించింది. నకిలీ వీడియోలతో బెదిరింపులన్నీ తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేయడానికి, మానసికంగా కృంగదీయడానికే అని విప్రజ్ ఎఫ్‌ఐఆర్లో పేర్కొన్నాడు. కాల్ డేటా, మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు చేసేందుకు సైబర్ సెల్‌ సాయం కూడా కొత్వాలి నగర్‌ పోలీసులు తీసుకుంటున్నారు. బెదిరింపు చేసేది ఇంతకీ అమ్మాయా? లేదా అబ్బాయా అని ఇంకా తెలియరాలేదు.

Also Read: Harmanpreet Kaur: ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విప్రజ్ నిగమ్‌ని రూ.50 లక్షలకు తీసుకుంది. 21 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ తన తొలి సీజన్‌లోనే బ్యాట్, బంతితో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ లలో 142 పరుగులు, 11 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పుడు ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య ఈరోజు ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు, 116 పరుగులు చేశాడు. ఆరు లిస్ట్ A మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు, 35 పరుగులు కూడా చేశాడు. 21 టీ20 మ్యాచ్‌లలో 206 పరుగులు, 19 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version