Site icon NTV Telugu

Team India: టీమిండియాకు మరో షాక్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి కీలక బౌలర్ అవుట్..!!

Deepak Chahar

Deepak Chahar

Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో కీలక ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేల నుంచి అతడు తప్పుకున్నాడు. దీపక్ చాహర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Read Also: Gujarat: గుజరాత్‎లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు

ఆస్ట్రేలియాలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు స్టాండ్‌బై ఆటగాళ్లుగా శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, రవి బిష్ణోయ్‌ ఎంపికయ్యారు. చీలమండ గాయంతో బాధపడుతున్న దీపక్ చాహర్ మెగా టోర్నీకి అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న దీపక్ చాహర్ ఇటీవల జట్టులోకి వచ్చాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి స్టాండ్ బైగా అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడిని టీమ్‌తో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు. ప్రపంచకప్‌లో టీమిండియా ప్రాక్టీస్‌ కోసం ముకేష్ చౌదరి, చేతన్‌ సకారియాలను నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు. వీరు టీంతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఇప్పటికే భారత జట్టు పెర్త్ చేరుకుంది. ఈనెల 10, 13 తేదీల్లో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 17న ఆసీస్‌తో రోహిత్ సేన వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. మెగా టోర్నీలో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Exit mobile version