Site icon NTV Telugu

Daryl Mitchell: అతడిని టార్గెట్ చేశాం.. అసలు ప్లాన్ చెప్పేసిన డారిల్ మిచెల్!

Daryl Mitchell

Daryl Mitchell

ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్.. తమ విజయ రహస్యం ఏంటో చెప్పాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మొదటి బంతి నుంచే దాడి చేయాలని తాము ముందే నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కుల్దీప్ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఒకసారి రిథమ్‌లోకి వస్తే మ్యాచ్‌నే నియంత్రించగలడని, అందుకే అతడిని మొదటి బంతి నుంచే ఒత్తిడిలోకి నెట్టాలని భావించామని మిచెల్ చెప్పాడు.

17వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు రాగా.. తొలి బంతినే డారిల్ మిచెల్ సిక్సర్ కొట్టాడు. దాంతో మ్యాచ్ ఆసాంతం కుల్దీప్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరి దశలో ఒత్తిడి మరింత పెరిగింది. 41వ ఓవర్‌లో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి కుల్దీప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో బంతిని స్టాండ్స్‌కు తరలించారు. ఫలితంగా కుల్దీప్ ఆరు ఓవర్లలో 1 వికెట్‌కు 48 పరుగులు ఇచ్చాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్‌ వరుసగా విఫలమవడం రెండోసారి. రాజ్‌కోట్ వన్డేలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లు అతడిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో మిచెల్ అజేయంగా 131 పరుగులు చేయగా, విల్ యంగ్ 85 రన్స్ చేశాడు. కుల్దీప్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు ఇచ్చాడు. యంగ్ వికెట్ పడినప్పటికీ అప్పటికే భారత్ చేతిలోంచి మ్యాచ్ జారిపోయింది.

Also Read: Lava Blaze Duo 3 Launch: డ్యూయల్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. అతి తక్కువ ధరలో టాప్ ఫీచర్స్!

‘కుల్దీప్ యాదవ్ ప్రపంచ స్థాయి స్పిన్నర్. అందుకే మొదటి బంతి నుంచే దాడి చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. అతడిని ఒత్తిడిలోకి నెట్టాలంటే మేము అటాక్ చేయాలి. కుల్దీప్ బాగా బౌలింగ్ చేస్తే మొత్తం బౌలింగ్ అటాక్‌ను సెటప్ చేస్తాడు. రెండు వైపులా బంతిని తిప్పగలడు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు కీలక పాత్ర పోషిస్తాడని నాకు నమ్మకం ఉంది’ అని మిచెల్ ప్రశంసించాడు. గ్లెన్ ఫిలిప్స్‌తో తన భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి ఆటలో వేర్వేరు కోణాలు ఉన్నాయి. అందుకే మేం కలిసి ఆడగలుగుతాం. అతడు చాలా వేగంగా పరుగులు తీస్తాడు. అతడికి సరిపడేలా నేను కూడా పరుగెత్తడమే నా ఛాలెంజ్. ప్రారంభంలో వికెట్లు పడిన తర్వాత భాగస్వామ్యాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాం’ అని మిచెల్ చెప్పాడు.

భారత పరిస్థితుల్లో తన విజయానికి ఐపీఎల్ అనుభవమే కారణమని డారిల్ మిచెల్ పేర్కొన్నాడు. ‘చెన్నై, రాజస్థాన్ జట్లకు ఆడినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. భవిష్యత్తులో చాలా సార్లు భారత్ రావాలని ఆశిస్తున్నాను. భారత్‌ టూర్ ప్రత్యేకమైన అనుభూతి. ఇక్కడి అభిమానుల ముందు ఆడటం చాలా గొప్ప విషయం. ఈ విజయం న్యూజిలాండ్‌కు చారిత్రాత్మకం. భారత గడ్డపై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం సాధించడంలో ప్రశాంత నిర్ణయాలు, జట్టు మీద నమ్మకమే కారణం. మా జట్టు ప్రశాంతంగా ఉండటం, స్పష్టమైన ప్రణాళికలతో ఆడటం నన్ను గర్వపడేలా చేసింది’ అని డారిల్ మిచెల్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version