న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై కనీసం నాలుగు వన్డే సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో శతకం బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. 34 ఏళ్ల మిచెల్.. భారత్‌లో టీమిండియాపై ఆడిన తన 8వ వన్డేలోనే నాలుగో సెంచరీ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మిచెల్ 104 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. భారత గడ్డపై భారత్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ముందంజలో ఉన్నాడు. 11 వన్డేలు ఆడి 5 సెంచరీలు చేశాడు. ఆ జాబితాలో మిచెల్ రెండో స్థానంలో నిలిచాడు.
భారత్‌లో టీమిండియాపై డారిల్ మిచెల్‌కు అద్భుత గణాంకాలు ఉన్నాయి. చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 130, 134, 84, 131 నాటౌట్, 137 స్కోర్స్ చేశాడు. దాంతో భారత గడ్డపై భారత జట్టుపై వన్డేల్లో వరుసగా ఐదు 50+ స్కోర్లు చేసిన ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు భారత్‌లో ఇండియాపై వన్డేల్లో వరుసగా నాలుగు 50+ స్కోర్లు చేసిన బ్యాటర్ల జాబితాలో క్రిస్ గేల్, డేమియన్ మార్టిన్, ఆండ్రూ సైమండ్స్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఇప్పుడు మిచెల్ కొత్త చరిత్ర సృష్టించాడు.
Also Read: Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?
డారిల్ మిచెల్ తన చివరి ఏడు వన్డేల్లో ఆరు సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. మొత్తానికి ఈ సిరీస్ డిసైడర్‌లో మిచెల్ మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకుంటూ.. భారత్ గడ్డపై అరుదైన రికార్డుతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మరోవైపు మూడో వన్డేలో 83 బంతుల్లోనే గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ బాదాడు. దాంతో కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. 46 ఓవర్లలో 6 వికెట్స్ నష్టానికి 293 రన్స్ చేసింది.
