Srikkanth Rejects Eoin Morgan as CSK Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రాంచైజీ కొత్త కోచ్ కోసం కొన్ని రోజులుగా అన్వేషణ కొనసాగిస్తోంది. 18 సీజన్ల పాటు జట్టుతో కలిసి పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల హెడ్ కోచ్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరు హెడ్ కోచ్ రేసులో బలంగా వినిపిస్తోంది. అయితే మాజీ భారత ఓపెనర్, సీఎస్‌కేతో గతంలో అనుబంధం ఉన్న కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం మోర్గాన్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇయాన్ మోర్గాన్ వచ్చే అవకాశం:
ఇటీవల భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఇయాన్ మోర్గాన్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. మోర్గాన్ పేరు చర్చలో ఉందని, ప్రాథమిక చర్చలు కూడా జరుగుతున్నట్లు తనకు అనిపిస్తోందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే క్రిస్ శ్రీకాంత్ మాత్రం మోర్గాన్‌ను కోచ్‌గా ఎంపిక చేయడాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన శ్రీకాంత్.. మోర్గాన్ మంచి ఆటగాడు, ఇంగ్లండ్‌కు మంచి కెప్టెన్ అని ప్రశంసించాడు. అయితే కోచ్‌గా మాత్రం అతడిని ఎంపిక చేయడం తనకు అస్సలు నచ్చదని అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ మోర్గాన్ సాధించింది ఏమీ లేదన్నారు.
గొప్పగా ఏమీ చేయలేదు:
‘సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ఇయాన్ మోర్గాన్‌ను నేను ఎంపిక చేయను. అతను మంచి ఆటగాడు, ఇంగ్లండ్‌కు మంచి కెప్టెన్. కానీ కోచ్‌గా అతడిని నేను అంగీకరించను. కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గొప్పగా ఏమీ చేయలేదు. అతను కామెంటరీకే పరిమితమైతే మంచిది’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. మరోవైపు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌ను కూడా సీఎస్‌కే కోచ్‌గా నియమించవద్దని శ్రీకాంత్ సూచించారు. మోర్గాన్, మెకల్లమ్ ఇద్దరి పేర్లను పక్కన పెట్టడం సీఎస్‌కేకు మంచిదని అభిప్రాయపడ్డారు. మెకల్లమ్ గతంలో కేకేఆర్‌కు 2020 నుంచి 2022 వరకు కోచ్‌గా పనిచేశాడు. అతడి కోచింగ్‌లో కేకేఆర్ 2021 ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఆసక్తికరంగా అదే సీజన్‌లో మోర్గాన్ కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
మిస్టర్ క్రికెట్ ఉన్నాడు:
ఇయాన్ మోర్గాన్, బ్రెండన్ మెకల్లమ్ కాకుండా సీఎస్‌కేలోనే ఉన్న అనుభవజ్ఞుడైన మైఖేల్ హస్సీని ప్రధాన కోచ్‌గా నియమించాలని క్రిస్ శ్రీకాంత్ సూచించారు. సీఎస్‌కే మాజీ ఓపెనర్‌గా సేవలందించిన హస్సీ ప్రస్తుతం జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. ‘సీఎస్‌కేకు బయట నుంచి ఎవరినీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వారి దగ్గరే మిస్టర్ క్రికెట్ ఉన్నాడు. మైఖేల్ హస్సీ ఆటోమేటిక్‌గా హెడ్ కోచ్ కావాలి. అతడే బెస్ట్ ఛాయిస్. హస్సీని కోచ్‌గా ఎంపిక చేసే ముందు సీఎస్‌కేలో ఎంఎస్ ధోనీ భవిష్యత్తు పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. ధోనీ జట్టులో ఏ హోదాలో కొనసాగుతాడనే అంశాన్ని ముందుగా నిర్ణయించాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు సవ్యంగా ముందుకు సాగుతాయి అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

