NTV Telugu Site icon

Mohammed Shami: క్రికెటర్ షమీ సొంతూరికి మినీ స్టేడియం, వ్యాయామశాల..

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami:వరల్డ్ కప్ టోర్నీలో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. టోర్నమెంట్‌లో ఆరు మ్యాచులు ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం షమీ వరల్డ్ కప్ తో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తప్పుకోవడంతో షమీకి ఛాన్స్ లభించింది. వచ్చీ రావడంతోనే షమీ సత్తా చాటుతున్నాడు.

Read Also: World Cup Final: ‘‘చక్ దే ఇండియా’’.. ఫైనల్స్‌కి ముందు ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఇజ్రాయిల్ రాయబారి వినూత్న పోటీ..

ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షమీ సొంతూరులో మినీ స్టేడియం, వ్యాయామశాల నిర్మించేందుకు అమ్రోహా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను యూపీ సర్కార్‌కి జిల్లా అధికారులు పంపారు. షమీ పూర్వీకుల గ్రామంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. వన్డే ప్రపంచకప్ 2023తో షమీ అద్భుత ప్రదర్శన తర్వాత అమ్రోహా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అమ్రోహా జిల్లాలోని సహస్‌పూర్ అలీనగర్ క్రికెటర్ షమీ సొంతూరు.

అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి మాట్లాడుతూ.. మహ్మద్ షమీ గ్రామంలో మినీ స్టేడియం నిర్మించాలని మేము ఒక ప్రతిపాదనను పంపుతున్నాము, ఆ ప్రతిపాదనలో, ఓపెన్ జిమ్నాసియం కూడా ఉంటుందని, షమీ గ్రామంలో తగినంత భూమి కూడా ఉందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియంలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, జిల్లా అమ్రోహా స్టేడియంను కూడా దీనికి ఎంపిక చేశామని ఆయన అన్నారు.