Site icon NTV Telugu

Rishabh Pant: ఓపెనర్‌గా ఫెయిల్.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

Criticism On Rishabh Pant

Criticism On Rishabh Pant

Cricket Fans Fires On Rishabh Pant For Failing As Opener: కొంతకాలం నుంచి రిషభ్ పంత్ ఫామ్‌లో లేడు. తనకు ఎన్నో అవకాశాలు వచ్చినా.. వాటిని సద్వినియోగపరచుకోలేదు. ఈ క్రమంలోనే.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం వల్లే తాను సరిగ్గా ఆడలేకపోతున్నానని రిషభ్ వాపోయాడు. అతనికి మాజీలు సైతం మద్దతు తెలిపారు. భారీ షాట్లు బాదడంలో రిషభ్ తోపు అని, అలాంటి బ్యాటర్‌ను ఓపెనర్‌గా రంగంలోకి దింపితే, జట్టుకి భారీ స్కోరు తోడవుతుందని తెలిపారు. అభిమానుల నుంచి సైతం పంత్‌ని ఓపెనర్‌గా దింపాలంటూ రిక్వెస్ట్‌లు వచ్చాయి. దీంతో.. న్యూజీల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ అతడ్ని ఓపెనర్‌గా పంపింది.

తాను కోరినట్టుగానే ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి.. ఇక రిషభ్ పంత్ చెలరేగిపోతాడని అంతా అనుకున్నారు. భారీ షాట్లు బాదుతూ, పరుగుల వర్షం కురిపించడం ఖాయమని భావించారు. తీరా చూస్తే.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. 13 బంతులు ఆడిన పంత్.. కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్‌ ఇచ్చి, తన వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో.. క్రీడాభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా చెత్తగా ఆడుతావంటూ ఏకిపారేస్తున్నారు. కొందరైతే.. వచ్చిన అవకాశాలన్నింటినీ నిర్లక్ష్యపు ఆటతో చేజార్చుకుంటున్న నీకు, కెప్టెన్సీ కావాలా? అంటూ వ్యంగ్యంగా సెటైర్లు చేస్తున్నారు. వెంటనే ఇతడ్ని జట్టు నుంచి తొలగించి, సంజూ శాంసన్‌కి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు ఇవ్వలేదని, అతడు దారిలోకి రావాలంటే కొన్నాళ్లు పక్కకు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతనికి వ్యతిరేకంగా.. పోస్టులు హోరెత్తిపోతున్నాయి. కాగా.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశం తెరపైకి రావడంతో, టెస్ట్‌ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌ చేయాలని అతని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే పంత్ పేలవ ప్రదర్శనని ప్రశ్నిస్తూ, ఇతనికి కెప్టెన్సీ అవసరమా? అని కొందరు నిలదీస్తున్నారు. ఇతనికంటే సంజూ బాగా ఆడుతాడని, అతనికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Exit mobile version