Site icon NTV Telugu

Spyder Camera: ‘స్పైడర్’ను బ్యాన్ చేయండి.. ఇది ఫీల్డర్లకు శాపం

Spyder Camera Ban

Spyder Camera Ban

Cricket Fans Demanding To Ban Spyder Camera: స్పైడర్‌ కెమెరా.. ఇది మైదానంలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల కదలికల్ని, మ్యాచ్‌ని కవర్ చేస్తుంది. ఇతర కెమెరామెన్లు చేయలేని పనిని, ఇది చేసి చూపిస్తుంది. అయితే.. ఈ కెమెరా వల్ల ఒక పెద్ద చిక్కు కూడా ఉంది. బ్యాటర్లు భారీ షాట్లు కొట్టి, బంతిని గాల్లో లేపినప్పుడు.. ఈ కెమెరా కదలికలు ఫీల్డర్లను కాస్త అయోమయానికి గురి చేస్తుంటాయి. దాని వల్ల క్యాచ్‌లు మిస్ అవుతుంటాయి. అంతేకాదు.. ఈ కెమెరా కేబుల్‌కి బంతి తగిలినప్పుడు, దాని గమ్యం కూడా మారిపోతుంటుంది. అంటే.. ఒకచోట పడాల్సిన బంతి, మరొక చోట పడుతుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే మొన్న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దాంతో.. షాన్ మసూద్‌కి ఒక లైఫ్ వచ్చింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.

షాన్ మసూద్ 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఒక భారీ షాట్ కొట్టాడు. దాంతో బంతి గాల్లోకి ఎగిరింది. తనవైపుకి బంతి దూసుకువస్తుండటంతో.. క్యాచ్ పట్టేందుకు డీప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. కానీ.. ఇంతలోనే ఆ బంతి నేరుగా స్పైడర్ కెమెరా కేబుల్‌కి తగలడంతో, దాని దిశ మారిపోయింది. కోహ్లీ చేతికి చిక్కాల్సిన ఆ బంతి.. వేరే చోట పడింది. అలా షాన్ మసూద్ సేవ్ అయ్యాడు. ఒకవేళ​స్పైడర్‌ కెమెరా లేకపోయుంటే.. ఆ బంతి నేరుగా కోహ్లీ చేతిలో పడి, షాన్ మసూద్ ఔటయ్యేవాడు. కానీ.. అలా జరగలేదు. అది చూసిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు.. స్పైడర్ కెమెరాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాండ్యా అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బూతులు తిట్టడాన్ని మనం గమనించవచ్చు. ఇలా మసూద్‌కి లైఫ్ రావడం వల్లే.. అతడు ఆర్థశతకం చేసి, తన పాక్ జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని తెచ్చిపెట్టాడు.

ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఒకసారి జరిగింది. 2014-15లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఒక మ్యాచ్‌ సందర్భంగా బంతికి గాల్లోకి లేపగా.. ఈ స్పైడర్‌ కెమెరా అడ్డు రావడం వల్లే బతికిపోయాడు. ఇంకా చాలా సందర్భంగాల్లో పీల్డర్లు ఈ కెమెరా వల్ల ఇబ్బందిపడ్డారు. దీంతో.. ‘‘స్పైడర్ కెమెరా అవసరమా? ఇది పరోక్షంగా బ్యాటర్లకు అదృష్టం కలిగిస్తోంది, ఫీల్డర్లకు శాపంగా మారుతోంది. దీన్ని బ్యాన్ చేయండి’’ అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. 2007లో ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ఈ స్పైడర్ కమెరాల్ని తొలిసారి ఉపయోగించారు. అప్పట్నుంచి క్రమంగా ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది.

https://twitter.com/Vaishnaviiyer14/status/1584114247054655489?s=20&t=hBrjn8Xi5vecdLjOfIVlYA

Exit mobile version