Site icon NTV Telugu

టీ20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుపై రగడ

టీ20 ప్రపంచకప్‌ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్‌ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్ రేట్ అధికంగా ఉన్నాయి.

Read Also: ఆస్ట్రేలియాలో మహాత్ముడికి అవమానం

సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోయినా ఈ టోర్నీ ఆసాంతం బాబర్ ఆజమ్ రాణించాడు. అతడు ఆరు మ్యాచ్‌లు ఆడి 60.60 సగటుతో 303 పరుగులు చేసి టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డుకు వార్నర్‌ను ఎలా ఎంపిక చేస్తారని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడుతున్నాడు. బాబర్ ఆజమ్‌కు ఈ అవార్డు ఇవ్వకపోవడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్‌ను కాదని వార్నర్‌ను మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు కోసం ఎంపిక చేయడం అనైతికం అని అక్తర్ విమర్శించాడు. అక్తర్ కాకుండా పలువురు ఆటగాళ్లు కూడా ఆజమ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version