NTV Telugu Site icon

Commonwealth games: కామన్వెల్త్ గేమ్స్‌‌కు తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ ..

Nikhat Zareen

Nikhat Zareen

కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్‌.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది.

” తిరిగి నా లయ అందుకోవడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ తర్వాత నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇంటికి వెళ్లి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పోలిస్తే ఈ ట్రయల్స్‌లో 50 శాతం ప్రదర్శన కూడా చేయలేదని తెలుసు. అయినప్పటికీ నా ప్రత్యర్థులందరిపై ఏకపక్ష విజయాలు సాధించా. నేనెప్పుడూ పోటీపడే బరువు విభాగం ఇది కాదు. దీనికి తగ్గట్లుగా మారేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉంది. అలసట నుంచి కోలుకునేందుకు కొన్ని రోజుల విశ్రాంతి తీసుకుని నా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఫోకస్ పెడతా” అని విజయానంతరం నిఖత్‌ తెలిపింది.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత లవ్లీనా (70 కేజీలు).. పూజ (రైల్వేస్‌)పై నెగ్గి కామన్వెల్త్ బెర్త్ సాధించింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ తర్వాత దీని కోసం ఎంతో కష్టపడ్డా. టోక్యోలో పసిడి నెగ్గాలనుకున్నా కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారిద్దామనుకుంటే బయట కార్యక్రమాల కారణంగా సమయం దొరకలేదు. ఎన్నో సన్మాన, ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ రాలేను అని చెబితే పతకం గెలవగానే అహం పెరిగిందని అనుకుంటారని వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రాక్టీస్‌ దెబ్బతింది. అది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రభావం చూపింది” అని లవ్లీనా పేర్కొంది.