NTV Telugu Site icon

Commonwealth Games: తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది. తెచ్చే పతకాలెన్నో..

Commonwealth Games

Commonwealth Games

Commonwealth Games: కామన్వెల్త్‌ గేమ్స్‌ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు (అంటే 12 రోజుల పాటు) జరగనున్నాయి. ఈ పోటీల్లోని 6 ఈవెంట్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్‌లో ఆరుగురు, బాక్సింగ్‌లో ఇద్దరు, టేబుల్‌ టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, క్రికెట్‌, హాకీలో ఒక్కరు చొప్పున ప్రాతినిధ్యం వహించనున్నారు. వీళ్లు దేశానికి పెద్దఎత్తున పతకాలు తెస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల గత చరిత్ర, ఘన చరిత్ర క్లుప్తంగా..

1. కిడాంబి శ్రీకాంత్‌: గతంలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌. సింగిల్స్‌ కేటగిరీలో స్వర్ణం గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పోయినసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ టీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. సింగిల్స్‌ కేటగిరీలో పసిడిని సొంతం చేసుకోవాలంటే టీమ్మేట్‌ లక్ష్యసేన్‌తోపాటు సింగపూర్‌కి చెందిన లో కీ వ్యూ కన్నా మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది.

read also: Cricket: మన మహిళల క్రికెట్‌కి మంచి రోజులు.. ఈసారి వరల్డ్‌ కప్‌ ఇండియాలోనే

2. పీవీ సింధు: ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ఈమెను నిలువరించటం ఎవరి తరమూ కాదనిపిస్తోంది. నాలుగేళ్ల కిందట ఫైనల్లో సైనా నెహ్వాల్‌ చేతిలో ఓడిపోయినా ఆ తర్వాత చాలా టోర్నీల్లో సత్తా చాటింది. కెనడాకి చెందిన మిచెలి లి, స్కాట్‌ల్యాండ్‌ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మర్‌, సింగపూర్‌ ప్లేయర్‌ యో జియా మిన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. అయినా పీవీ సింధూదే పైచేయి అవుతుందని విశ్వసిస్తున్నారు.

3. సుమీత్‌ రెడ్డి: కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలి పతకంపై గురిపెట్టాడు. ఈ 30 ఏళ్ల కుర్రోడు గతంలో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఇప్పుడు అశ్వినీ పొన్నప్పతో జట్టు కడుతున్నాడు. ఈ జంట ఇండియాలో జరిగిన సెలక్షన్లలో వర్ధమాన ఆటగాళ్లపై అవలీలగా విజయాలు నమోదుచేసి అగ్ర స్థానంలో నిలిచారు. మలేసియాకి చెందిన గాన్‌ కియాన్‌ మెంగ్‌/లాయ్‌ పీ జింగ్‌ ప్రత్యర్థులు.

4. గాయత్రి గోపీచంద్‌: పుల్లెల గోపీచంద్‌ కూతురు. త్రీసా జోలీతో జట్టు కట్టి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చాటుకున్నారు. సెలక్షన్‌ ట్రయల్స్‌లో సక్సెస్‌ అయ్యారు. ఉమెన్స్‌ డబుల్స్‌ కేటగిరీలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డీ జోడీ కన్నా ముందే వీళ్ల ఈవెంట్‌ జరగనుంది. ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించి ఒక పాయింట్‌ కైవసం చేసుకున్నారు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఎంట్రీ ఇచ్చారు.

5. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి: అమలాపురానికి చెందిన ఈ షట్లర్‌ ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్లలో ఒకడిగా ఎదిగాడు. చిరాగ్‌శెట్టీతో కలిసి మన దేశానికి థామస్‌ కప్‌ అందించాడు. కామన్వెల్త్‌లో ఈ కిరీటాన్ని నిలబెట్టుకోవాలంటే ఆరాన్‌ చియా, సో వూ యిక్‌తో తలపడి నిలబడాలి. ఏబీసీ చోర్నీలో మలేసియా జంట చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ కామన్వెల్త్‌ గేమ్స్‌లోని మెన్స్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో ఫేవరెట్‌ జోడీగా బరిలోకి దిగుతున్నారు.

6. నిఖత్‌ జరీన్‌: పాతికేళ్ల వయసున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌.. బాక్సింగ్‌ ఈవెంట్‌లో ఇండియాకి తప్పనిసరిగా పతకం తెచ్చే క్రీడాకారిణిగా ఆశలు రేకెత్తిస్తున్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న ఈ తెలంగాణ బాక్సర్‌ 50 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకం కొట్టాలని చూస్తున్నారు. గత ప్రపంచ కప్‌ల్లో థాయిల్యాండ్‌కి చెందిన జితాపంగ్‌ జుతామాస్‌ని 5-0 తేడాతో మట్టి కరిపించి గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నారు.

7. మహ్మద్‌ హుసాముద్దీన్‌: తెలంగాణకు చెందిన ఈ 28 ఏళ్ల బాక్సర్‌ ఇటీవలే గాయం నుంచి కోలుకొని మళ్లీ రంగంలోకి దిగాడు. గోల్డ్‌ కోస్ట్‌లో 56 కేజీల కేటగిరీలో కాంస్య పతకం సాధించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌ మెరుగైన ప్రదర్శన చేసి మరింత ఉన్నత పతకాన్ని మెడలో వేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇతను ఈమధ్యే తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో రోహిత్‌ మార్‌ పైన అతి కష్టం మీద నెగ్గాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో 57 కేజీల కేటగిరీలో పోటీ చేసే ఛాన్స్‌ దక్కించుకున్నాడు.

8. ఆకుల శ్రీజ: నేషనల్ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మూడు కేటగిరీల్లో పోటీపడనుంది. ఉమెన్స్‌ సింగిల్స్, రీత్‌ రిషియాతో కలిసి డబుల్స్‌, శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడనుంది. గతంలో మానికా బాత్ర పైన విజయం సాధించింది. సింగపూర్‌కి చెందిన ఫెంగ్‌ తియాన్వి ఈమె ప్రధాన ప్రత్యర్థి.

9. జ్యోతి ఎర్రాజి: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఈ 22 ఏళ్ల అథ్లెట్‌ ఇటీవల మూడు జాతీయ రికార్డులను నెలకొల్పింది. యూరప్‌లో జరిగి అంతర్జాతీయ పోటీల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుతంగా మెరిసింది. 100 మీటర్ల దూరాన్ని 13.04 సెకన్లలో చేరుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మొదటిసారి పాల్గొంటోంది. 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుకొని పతకం పొందాలని ఆశలు పెట్టుకుంది.

10. సబ్బినేని మేఘన: ఈ 26 ఏళ్ల అమ్మాయి రీసెంటుగా టీ20 ఛాలెంజ్‌ టోర్నమెంట్‌లో సత్తా చాటింది. ఇండియా తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడింది. మీడియం పేస్‌ బౌలింగ్‌, ఓపెనింగ్‌ బ్యాటింగ్‌లో తననుతాను నిరూపించుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే టీమ్‌(11 మందిలో) చోటు కోసం కఠోరంగా శ్రమించింది. ఇక్కడ రాణిస్తే ఇక ఈమెకు తిరుగుండదని భావిస్తున్నారు.

11. రజిని ఎతిమార్పు: ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిపెరిగిన ఈ 32 ఏళ్ల గోల్‌ కీపర్‌ స్విట్జార్లాండ్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ హాకీ 5ఎస్‌ టోర్నీలో భారత జట్టును ముందుండి నడిపించింది. ఇండియా టీమ్‌ ఫైనల్‌ బెర్త్‌ను త్రుటిలో కోల్పోయింది. ప్రస్తుతం కామన్వెల్త్‌ గేమ్స్‌లో సవితా పునియా నాయకత్వంలో ఆడనుంది. తనదైన సమయం కోసం ఎదురుచూస్తోంది.

Show comments