బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది. జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ (38) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే యమక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో మూడో రౌండ్‌కు ముందు రింగ్‌లోనే యమక్ కుప్పకూలాడు.
ఈ విషయాన్ని గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి బాక్సర్‌ను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే బాక్సర్ మృతిచెందాడు. కాగా రెండో రౌండ్‌లో వండెరా భారీ పంచ్‌తో ముసాకు ముచ్చెమటలు పట్టించాడు. టర్కిష్ సంతతికి చెందిన యమక్ 2017లో బాక్సింగ్‌లోకి వచ్చినా.. 2021లో డబ్ల్యూబీఫెడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూరోపియన్, ఏషియన్ ఛాంపియన్ షిప్‌లను యమక్ సొంతం చేసుకున్నాడు. యమక్ మరణంపై తోటి బాక్సర్లు తమ సంతాపం ప్రకటించారు.