Angry Ben Stokes: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 438 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 354 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర ఆటగాడు వికెట్ తీసినా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంబరాలు చేసుకోకపోవడంతో.. స్టోక్స్ అతడిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 114వ ఓవర్‌లో జరిగింది.
స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ క్యాచ్ ఔటయ్యాడు. బషీర్ క్యాచ్ (కాట్ అండ్ బౌల్) అందుకుని వికెట్ సాధించగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. అయితే జోఫ్రా ఆర్చర్ మాత్రం అందరికి దూరంగా నిలబడ్డాడు. ఇది గమనించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ వెంటనే ఆర్చర్‌ను పిలిచి జట్టుతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించాడు. ఈ దృశ్యం కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అయితే ఆర్చర్ ఇలా ప్రవర్తించడానికి ఓ కారణం లేకపోలేదు. అంతకుముందు ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను బషీర్ వదిలేశాడు. దీంతో ఆర్చర్ నిరాశకు గురయ్యాడని, అందుకే సంబరాల్లో పాల్గొనలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 7000కు పైగా పరుగులు, 250కు పైగా వికెట్లు సాధించిన ప్రపంచంలో రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్ తర్వాత ఈ అరుదైన డబుల్‌ను నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 122 టెస్టుల్లో స్టోక్స్ 7,243 పరుగులు చేయడంతో పాటు 250 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మాథ్యూ హోగార్డ్‌ను అధిగమించి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (151), డెవాన్ కాన్వే (157) తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు అద్భుత ఆరంభం అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో న్యూజిలాండ్ మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తుండగా.. ఇంగ్లండ్ తిరిగి పోరులోకి రావాలని చూస్తుంది.
🚨Ben Stokes had some words for Jofra Archer after the pacer initially didn’t join in the celebrations following Shoaib Bashir’s caught and bowled. Bashir had dropped a catch off Archer’s bowling the over before pic.twitter.com/7FiKNzQdKV
— SheR•ALI (@Sher__Ali) June 27, 2026

