Site icon NTV Telugu

Virat Kohli Test Comeback: విరాట్‌ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. టెస్ట్ క్రికెట్‌లోకి మరలా ‘కింగ్’?

Virat Kohli Test Retirement

Virat Kohli Test Retirement

టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్‌ కోహ్లీ’ మరలా టెస్ట్ క్రికెట్‌ ఆడనున్నాడా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీని టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నాలు చేయడనికి సిద్దమైందట. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది మే 12న కింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

టెస్టు ఫార్మాట్‌లో జట్టును బ్యాలెన్స్‌ చేయడానికి చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలు వరుసగా రిటైర్మెంట్ ఇచ్చారు. వీరి వీడ్కోలుకు కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ అని జోరుగా ప్రచారం జరిగింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ 2-0తో వైట్‌వాష్‌కు గురవడంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గంభీర్‌ మితిమీరిన ప్రయోగాల కారణంగానే జట్టు ఓటములకు కారణమని మాజీలు, ఫాన్స్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ, రోహిత్‌ రిటైర్మెంట్‌ తర్వాత జట్టు పూర్తిగా లయ తప్పిందని దక్షిణాఫ్రికా సిరీస్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్‌ తీసుకొన్న ప్లేయర్స్ తమ నిర్ణయాల్ని పునఃపరిశీలించాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. ముఖ్యంగా కోహ్లీ టెస్ట్ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆసక్తిగా ఉందట. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Also Read: iPhone 17 Price Hike: ‘యాపిల్’ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఐఫోన్ 17 ధర!

విరాట్ కోహ్లీ జూన్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్‌స్టన్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4, రెండవ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. చివరి టెస్ట్ జనవరి 2025లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలు చేశాడు. ఆధునిక టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన, శక్తివంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా కింగ్ నిలిచాడు. కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు చారిత్రాత్మకమైనది. 68 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 40 మ్యాచ్‌లలో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉంది. కొన్ని సంవత్సరాలలో అతడు జట్టును నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాడు. భారత్ టెస్ట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్సీ రికార్డు మరెవరికీ లేదు.

Exit mobile version