ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లీ.. కొంతకాలం నుంచి ఆ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోన్నా.. వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి సెంచరీ కూడా చేయలేదు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లోనూ ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీపై వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి రాణించకపోతే.. అదే అతని ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధికారు ఒకరు ఈ విషయంపై స్పందిస్తూ.. ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ బాగా ఆడకపోతే.. ఇదే అతని ఆఖరి సిరీస్ కావొచ్చని, టీ20 ప్రపంచకప్-2022 జట్టులో స్థానం దక్కకపోవచ్చని కుండబద్దలు కొట్టాడు. ‘‘భారత క్రికెట్‌కు కోహ్లీ ఎన్నో సేవలు అందించాడు. అత్యుత్తమ ప్రదర్శనలతో చాలా రికార్డుల్ని నమోదు చేశాడు. అయితే, కొంతకాలం నుంచి అతడు ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ విషయాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. సెలక్టర్లు సైతం ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను జట్టుకి ఎంపిక చేస్తారు. అంతే తప్ప వారి పేరు ప్రఖ్యాతల్ని పట్టించుకోరు’’ అని ఆ అధికారి చెప్పాడు.
అంతేకాదు.. ‘‘నా అభిప్రాయం ప్రకారం, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లీ రాణిస్తేనే ముందుకు సాగుతాడు. విఫలమైతే మాత్రం.. టీ20 వరల్డ్ కప్ జట్టులో అతడికి ప్రత్యామ్నాయాలను సెలక్టర్లు కచ్చితంగా వెదుకుతారు’’ అని ఆ అధికారి పేర్కొన్నాడు. మరి, ఈ చివరి అవకాశాన్ని అయితే కోహ్లీ సద్వినియోగపరచుకుంటాడా? లేక ఎప్పట్లాగే విఫలమై జట్టులో చోటు కోల్పోతాడా? కోహ్లీ తిరిగి పామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. కోహ్లీ సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు కానీ, ప్రతీసారి ఫెయిల్ అవుతున్నాడు.