NTV Telugu Site icon

IPL 2023: వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త రూల్.. కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే..!!

Impact Player

Impact Player

IPL 2023: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ రూల్ భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఆట ప్రారంభం కావడానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్‌స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు కేవలం సబ్‌స్టిట్యూట్‌లా కాకుండా పూర్తి ఆటగాడి తరహాలో ఆడతారు. అంటే సదరు సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది.

Read Also: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. కుల్దీప్ యాదవ్‌కు చోటు.. సారథి ఎవరంటే?

అయితే బీసీసీఐ నిబంధన ప్రకారం జట్టులో ఎవరైనా భారత ఆటగాడు లేదా విదేశీ ఆటగాడి స్థానంలో కేవలం భారత ఆటగాడినే సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడానికి కుదరదు. ఒక జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన ప్రకారం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన వల్ల ఫ్రాంచైజీలు బాగా లాభపడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఛేజింగ్ సమయంలో స్పెషలిస్టు బ్యాటర్‌ను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే స్పెషలిస్ట్ బౌలర్‌ను సబ్‌‌స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ నిబంధనతో ఆల్‌రౌండర్ల ప్రాముఖ్యత తగ్గిపోతుందని పలువురు భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా ఆట మరింత రసవత్తరంగా సాగుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీసీసీఐ అమలు చేసింది. మరి ఐపీఎల్‌లో ఈ నిబంధన సక్సెస్ అవుతుందో.. ఫెయిల్యూర్ అవుతుందో వేచి చూడాల్సిందే.