Site icon NTV Telugu

BCCI: మాజీ క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. భారీగా పెన్షన్ పెంపు

Bcci

Bcci

మాజీ క్రికెట‌ర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్‌లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రక‌టించింది. ఈ పెన్షన్ పెంపు పురుషులతో పాటు మహిళా మాజీ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. క‌నిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్‌ను రూ.30 వేలకు బీసీసీఐ పెంచింది. అంతేకాకుండా గ‌రిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.70 వేల‌కు పెంచింది. ఆటగాళ్లకు కేట‌గిరీలుగా ఈ పెన్షన్‌ అందిస్తారు. తమ పెన్షన్లు పెంచాలని ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ (ICA) గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇప్పటివరకు రూ.30వేలు పెన్షన్ పొందుతున్న మహిళా క్రికెటర్లకు ఇకపై రూ.52,500 పెన్షన్ లభిస్తుంది. 2003కు ముందు రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అందుకునే పెన్షన్ రూ.22,500 నుంచి రూ.45వేలకు పెరగనుంది. జూన్ 1 నుంచి పెన్షన్ పెంపు అమ‌ల్లోకి వస్తుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీసీసీఐ నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెట‌ర్లు, అంపైర్లకు ల‌బ్ధి చేకూర‌నుంది. ఐపీఎల్ నిర్వహణతో ఏటా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోన్న బీసీసీఐ ఈ లాభాల్లో కొంత మొత్తాన్ని మాజీ క్రికెటర్లకు అందిస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version