ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు ముగిసిన సందర్భంగా బీసీసీఐ 10 జట్ల లోగోలతో కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద జెర్సీని రూపొందించింది. దీంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు.
మరోవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు లక్షా 25 వేల మంది హాజరయ్యారు. ఈ వేడుకలకు హాజరైన బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఐపీఎల్ జెండాను పట్టుకుని స్టేడియంలో పరుగులు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. అనంతరం రాజమౌళి తీసిన సెన్సేషనల్ మూవీ ఆర్.ఆర్.ఆర్‌లోని నాటు నాటు తెలుగు పాటకు చిందులు వేశాడు. అటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీలోని ‘వాతీ కమ్మింగ్’ పాటకు సంబంధించి సిగ్నేచర్ స్టెప్పులు కూడా వేశాడు. అంతేకాకుండా లెటెస్ట్ సెన్సేషన్ మూవీ కేజీఎఫ్ 2లోని సలాం రాకీ భాయ్ పాటకు కూడా రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ చేసి అభిమానులను అలరించాడు.