NTV Telugu Site icon

BCCI: సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీసీసీఐ.. గంగూలీ, జై షాలకు పదవీ గండం..?

Bcci

Bcci

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తమ రాజ్యాంగంలోని కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను తొలగిస్తూ 2019 డిసెంబరులో చేసిన సవరణలను ఆమోదించాలంటూ 2019లో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని తన పిటిషన్‌లో బీసీసీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో వచ్చేవారం విచారణ తెలపనుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది.

Read Also: Telangana: తెలంగాణలో వరల్డ్ వాటర్ ఫాల్ రాప్లింగ్ పోటీలు

గతంలో జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల్లో గరిష్టంగా ఆరేళ్లకు మించి పదవుల్లో కొనసాగరాదు. ఒకవేళ అలా కొనసాగాల్సి వస్తే కూలింగ్‌ పీరియడ్‌ అంటే మధ్యలో మూడేళ్ల విరామం ఉండాలన్న తప్పనిసరి అన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను తొలగిస్తూ బీసీసీఐ 2019లో సవరణ చేసింది. దీంతో పాలకవర్గం సభ్యులు ఆరేళ్లు దాటినా పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. ఇది సుప్రీంకోర్టు ఆమోదం పొందితే పదవీకాలం ముగిసినా.. బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మరికొన్నాళ్లు తమ స్థానాల్లో ఉండొచ్చు. 2013 నుంచి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో జై షా అధికారిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బీసీసీఐ సెక్రటరీ పదవిలో ఉన్నారు. అలాగే గంగూలీ 2014 నుంచి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒకవేళ గతంలో బీసీసీఐ చేసిన సవరణలను సుప్రీంకోర్టు ఆమోదించకపోతే గంగూలీ, జై షా వారి పదవులు కోల్పోవాల్సి ఉంటుంది.