Site icon NTV Telugu

Pakistan: ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్.. బాబర్ ఆజమ్ ఖాతాలో చెత్త రికార్డు

Babar Azam

Babar Azam

పాకిస్థాన్‌కు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో పాకిస్థాన్ కోల్పోయింది. మంగళవారం ముగిసిన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) రాణించారు. తాజా ఓటమితో పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక ఏడాది కాలంలో సొంతగడ్డపై ఇలా నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పాకిస్థాన్ ఓడటం ఇదే తొలిసారి.

మరోవైపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టును వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి. దీంతో బాబర్ ఆజమ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు అయ్యింది. అటు ఈ ఏడాది పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు సిరీస్‌లలో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాకిస్థాన్.. టీ20 సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. అంతేకాకుండా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఓడిన బాబర్ సేన.. తాజాగా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్‌పై తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్థాన్.. పాయింట్ల టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది.

Exit mobile version