IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా చేరుకుంది. అరోన్ ఫించ్ (22), స్టీవెన్ స్మిత్ (35) రాణించారు. మ్యాక్స్‌వెల్ (1), ఇంగ్లీస్ (17), టిమ్ డేవిడ్ (18) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే రాణించాడు. అతడు 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు సాధించాడు.
Read Also:Oscar Award: ఇప్పటివరకు ఆస్కార్ అందుకున్న ఇండియన్స్ ఎవరంటే..?
కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు. అతడు 25 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా 71 పరుగులతో అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లీస్ మూడు వికెట్లు సాధించగా జోష్ హేజిల్ వుడ్ రెండు వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది.
