Site icon NTV Telugu

యాషెస్ సిరీస్‌: రెండో టెస్టులోనూ ఆసీస్‌దే విజయం

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్ (80) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి వారికి సహకారం లభించలేదు. దీంతో ఆసీస్‌కు 237 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Read Also: భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం

అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన స్కోరును 230/9 వద్ద డిక్లేర్డ్ చేసి ఇంగ్లండ్‌కు 468 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. లబుషేన్ (51), ట్రావిస్ హెడ్ (51) రాణించారు. అయితే ఇంగ్లండ్ టాపార్డర్ మళ్లీ విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌ హీరోలు రూట్, మలాన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుతిరగడంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపోయింది. క్రిస్ వోక్స్ (44) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో 192 పరుగులకే ఇంగ్లండ్ చాప చుట్టేయడంతో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ సన్ 5వికెట్లు, స్టార్క్, లయోన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యం సంపాదించింది. మరోవైపు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానానికి దూసుకెళ్లింది.

Exit mobile version