NTV Telugu Site icon

AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు

Aus Vs Eng

Aus Vs Eng

AUS Vs ENG: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే వరుణుడి వల్ల మూడు మ్యాచ్‌లు వాష్ అవుట్ కాగా శుక్రవారం వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వర్షం తగ్గినా మైదానం పూర్తిగా తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు స్పష్టం చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఖాతాలో చెరో పాయింట్‌ను జమ చేశారు.

Read Also: PAK Vs ZIM: పాకిస్థాన్, జింబాబ్వే మధ్య శత్రుత్వానికి మిస్టర్ బీన్ కారణమా?

గ్రూప్-1లో వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. శుక్రవారం ఆప్ఘనిస్తాన్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అంతకుముందు న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ గ్రూప్‌లో సెమీస్‌కు ఎవరు వెళ్తారన్న విషయం ఆసక్తిగా మారింది. గతంలో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ రెండు జట్లకు ఇవాళ్టి మ్యాచ్ కీలకం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా మ్యాచ్ రద్దు కావడం సెమీస్ సమీకరణాలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం గ్రూప్-1లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా నెట్ రన్‌రేట్ ప్రకారం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఐర్లాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.