జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. పోటీల్లో రెండో రోజైన మంగళవారం భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఏకంగా 24 పతకాలను కొల్లగొట్టారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. దీంతో రెండో రోజు ముగిసేసరికి భారత్ మొత్తం 35 పతకాలతో (9 స్వర్ణాలు, 11 రజతాలు, 15 కాంస్యాలు) పతకాల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాలలో ఒక్క అథ్లెటిక్స్ విభాగం నుంచే 20 పతకాలు రావడం విశేషం.
గోల్డెన్ స్టార్స్.. నిషాద్, దీప్తి, సిమ్రాన్ రికార్డు ప్రదర్శన
భారత స్టార్ అథ్లెట్ నిషాద్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఈ పారా గేమ్స్‌లో వరుసగా రెండో రోజూ స్వర్ణం సాధించాడు. పురుషుల లాంగ్ జంప్‌లో స్వర్ణం సాధించిన మరుసటి రోజే.. టీ47 (T47) హైజంప్ ఫైనల్లో 2.04 మీటర్ల ఎత్తు దూకి గేమ్స్ రికార్డుతో రెండో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలంగాణకు చెందిన 23 ఏళ్ల స్టార్ అథ్లెట్ దీప్తి జేవంజి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మహిళల 400 మీటర్ల టీ20 (T20) ఫైనల్‌ను 56.36 సెకన్లలో ముగించి గేమ్స్ రికార్డుతో వరుసగా రెండోసారి ఏషియన్ పారా గేమ్స్ స్వర్ణాన్ని ముద్దాడింది. ఇక పారాలింపిక్ పతక విజేత సిమ్రాన్ 200 మీటర్ల టీ12 (T12) రేసును 24.80 సెకన్ల రికార్డు టైమింగ్‌తో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించగా, తేజల్బెన్ దామోర్ కాంస్యాన్ని గెలుచుకుంది. పురుషుల డిస్కస్ త్రో F51/52/53 విభాగంలో ప్రణవ్ సూర్మా 11.66 మీటర్ల ఆసియా రికార్డు త్రోతో స్వర్ణం సాధించగా, భారత్‌కే చెందిన రామ్ రతన్ సింగ్ రజతం కైవసం చేసుకున్నాడు. డిస్కస్ త్రో F44/64 కేటగిరీలో దేవేందర్ కుమార్ మరొక స్వర్ణ పతకాన్ని అందించడంతో మంగళవారం భారత్‌కు 5 స్వర్ణాలు దక్కాయి.
షూటింగ్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్‌లలో పతకాల పంట
షూటింగ్లో మనీష్ నర్వాల్ (10మీ ఎయిర్ పిస్టల్ SH1) రజత పతకం సాధించి లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్ క్వోటాను ఖాయం చేసుకున్నాడు. శృష్టి అరోరా ఇదే ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన అశోక్ కుమార్ మాలిక్ 192 కేజీలు ఎత్తి రజతం సాధించాడు. స్విమ్మింగ్‌లో హిమాన్షు నందల్ (400మీ ఫ్రీస్టైల్ S11), నిరంజన్ ముకుందన్ (200మీ ఇండియన్ మెడ్లే SM7) చెరో కాంస్యాన్ని అందించారు. పారా టేబుల్ టెన్నిస్‌లో రవి బాబీ సహానా, ప్రాచీ పాండేలతో పాటు పారాలింపిక్ విజేత భవినా పటేల్, సోనాల్‌బెన్ పటేల్, జెహాన్ మదాన్లు కలిసి మొత్తం 5 కాంస్య పతకాలను భారతదేశానికి తెచ్చిపెట్టారు.
ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు ఖాయం
భారత పతకాల సంఖ్య మరింత పెరగడం దాదాపు ఖాయమైంది. ఆర్చరీ విభాగంలో కాంపౌండ్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా డిఫెండింగ్ ఛాంపియన్ శీతల్ దేవి మరొక పతకాన్ని ఖాయం చేసింది. స్వాతి చౌదరి (W1 కేటగిరీ), ఉమెన్స్ కాంపౌండ్ డబుల్స్ (శీతల్-పాయల్), రికర్వ్ డబుల్స్ (పూజ-భావన, హర్విందర్-విజయ్) జట్లు ఫైనల్ చేరి పతకాలు ఖాయం చేసుకున్నాయి. మరోవైపు బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్ ప్రమోద్ భగత్, పారాలింపిక్ విజేత కుమార్ నితేష్‌లు తమ తమ పురుషుల సింగిల్స్ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. పతకాల పరుగుతో భారత్ ఈసారి సరికొత్త రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతోంది.

