Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!

Gymnast Pranati Nayak

Gymnast Pranati Nayak

2026 ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి విషయంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన పరిణామం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వాహకులు ఇద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో.. వారు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక వసతి కోసం చెక్‌ఇన్ చేసే సమయంలో ప్రణతి, మిశ్రాకు ఒకే గది కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులను సంప్రదించారు.

గంటల ప్రయత్నాల అనంతరం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జోక్యం చేసుకోవడంతో ప్రణతి నాయక్, అశోక్ మిశ్రాకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటైంది. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు 1:30 గంటలకు వసతి గదికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. ప్రత్యేక గదికి సంబంధించిన తాళాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు హోటల్ సిబ్బంది రిజిస్టర్‌లో ఆయన బుకింగ్ కనిపించలేదు. ఇందుకు కారణం అధికారిక పత్రాల్లో జరిగిన చిన్నపాటి పొరపాటే. హోటల్ సిస్టమ్‌లో అశోక్ మిశ్రా పేరులోని ‘I’ అనే అక్షరం నమోదు కాలేదు. దీంతో ఆయన బుకింగ్‌ను గుర్తించడం, అక్రిడిటేషన్‌ను ధ్రువీకరించడం వంటి ప్రక్రియకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో రాత్రి 2 గంటల తర్వాతే కోచ్ తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలిగారు.

ఈ ఘటనపై ప్రణతి నాయక్ స్పందించారు. వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్న మాట వాస్తవమేనని, సుమారు రాత్రి 2 గంటల సమయంలో సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత బృందం జపాన్‌కు చేరుకున్నప్పటి నుంచి వసతికి సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది అథ్లెట్లు గదుల కేటాయింపు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చినట్లు సమాచారం. శిక్షణకు వెళ్లడం, పోషకాహారానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనూ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. భారత కబడ్డీ బృందానికి కూడా హోటల్ గదుల కేటాయింపు, చెక్‌ఇన్‌లో గందరగోళాలు ఎదురైనట్లు సమాచారం. దీంతో భారత బృందం వసతి, సమన్వయ ఏర్పాట్లపై చర్చ జరుగుతోంది. పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిపాలనా సమస్యలు లేకుండా ఏర్పాట్లు సజావుగా సాగాలని అథ్లెట్లు, కోచ్‌లు ఆశిస్తున్నారు.