Mohammed Siraj: తప్పించేందుకు కుట్రలు చేశారు.. ఇది ట్రైలర్ మాత్రమే.. సిరాజ్ భవిష్యత్తుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

R Ashwin, Mohammed Siraj

R Ashwin, Mohammed Siraj

R Ashwin on Mohammed Siraj Snub: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరాజ్‌ను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. అంతేకాకుండా 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం భవిష్యత్తులో జరగబోయే మార్పులకు కేవలం ట్రైలర్ మాత్రమేనని యాష్ అభిప్రాయపడ్డాడు.

వెల్లింగ్టన్ టెస్టు కోసం భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు చేపట్టగా.. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించేందుకు గత నెల రోజులుగా కుట్రలు చేశారని విమర్శించాడు. ‘సిరాజ్‌ను తప్పించడానికి వారం రోజులుగా ఎందుకు ఇలాంటి పరిస్థితి సృష్టించారు?. ఇది వారం రోజుల నుంచి కాదు.. నెల రోజులుగా జరుగుతోంది. మొదట వన్డేల్లో అతడికి అవకాశం ఇవ్వలేదు. 2027 వన్డే ప్రపంచ కప్ ముందుంది. అలాంటప్పుడు సిరాజ్ అవసరం లేదా?. 2023 ప్రపంచ కప్‌లో అతడు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో గుర్తు చేసుకోండి. ఆశ్చర్యపోకండి.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. తర్వాత కూడా ఇలాంటివి జరగొచ్చు’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

‘ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజే. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు 43 వికెట్లు పడగొట్టాడు. అలాంటి బౌలర్‌కు తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బుమ్రాతో పాటు సిరాజ్ పేరును ముందుగానే తుది జట్టులో ఖరారు చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు పేసర్లను ఎంపిక చేయండి. ఇందులో పోటీ ఎక్కడుంది?, నాకు అర్థం కావడం లేదు’ అని అశ్విన్ ప్రశ్నించాడు.

మరోవైపు సిరాజ్‌ను పక్కన పెట్టిన నిర్ణయాన్ని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమర్థించాడు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు కేవలం తొలి రోజు ఆటను మాత్రమే కాకుండా.. ఐదు రోజుల మ్యాచ్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశాడు. సిరాజ్‌ను తప్పించడం తప్పు నిర్ణయం కాదని పేర్కొన్నాడు. ‘సిరాజ్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. మేం జట్టును ఎంపిక చేసినప్పుడు ఇదే అత్యుత్తమ తుది జట్టు అని భావించాం. సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయమని నేను అనుకోవడం లేదు. ఇది కేవలం తొలి రోజు మాత్రమే. మేం జట్టును మొదటి రోజు కోసం మాత్రమే ఎంపిక చేయం. రెండో, మూడో, నాలుగో రోజులను కూడా దృష్టిలో పెట్టుకుంటాం’ అని కోటక్ వివరించాడు. సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని కోటక్ సమర్థించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.