Site icon NTV Telugu

Arshad Khan History: ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ ఖాన్ చరిత్ర!

Arshad Khan History

Arshad Khan History

మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను (6/9) నమోదు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో గతంలో టి రవితేజ (హైదరాబాద్), అర్జన్ నాగవాసల్లా (గుజరాత్) నెలకొల్పిన రికార్డు (6/13) బ్రేక్ అయింది. సంచలన బౌలింగ్ చేసిన అర్షద్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ బౌలర్ టి రవితేజ 2023 అక్టోబర్‌లో 13 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ బౌలర్ అర్జన్ నాగవాసల్లా కూడా 13 పరుగులకే 6 వికెట్స్ తీసుకున్నాడు. ఈ ఉమ్మడి రికార్డును తాజాగా అర్షద్ ఖాన్ బద్దలు కొట్టాడు. 2015లో సర్వీసెస్‌కు చెందిన డిఎస్ పూనియా (6/14), అదే సీజన్‌లో బరోడాకు చెందిన స్వాప్నిల్ సింగ్ (6/19) కూడా 6 వికెట్స్ పడగొట్టారు. కొత్త బంతితో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన అర్షద్.. డెత్ ఓవర్లలో మూడు వికెట్లు తీసి చండీగఢ్‌ను 134/8కి పరిమితం చేశాడు. ఆపై హర్ష్ గవాలి (74) పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్ 14 ఓవర్లలో విజయం సాధించింది.

Also Read: Rohit-Kohli: రో-కోలు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు!

అర్షద్ ఖాన్ అద్భుత స్పెల్ ఇప్పుడు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. దేశీయ క్రికెట్‌లో ఎడమచేతి వాటం సీమర్‌లకు ఇది ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ ప్రదర్శన అర్షద్ కెరీర్‌కు కాలిసి రానుంది. 26 ఏళ్ల అర్షద్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ చెలరేగడంతో అతడిపై భారీ అంచనాలు ఉండనున్నాయి.

Exit mobile version