Ajit Agarkar: భారత క్రికెట్‌లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!

Bcci Ajit Agarkar Exit

Bcci Ajit Agarkar Exit

Ajit Agarkar Set For Exit: భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక కోసం బుధవారం (సెప్టెంబర్ 16) సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశమే అగార్కర్‌కు చివరి మీటింగ్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అగార్కర్ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్చ చేయలేదని సమాచారం.

అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. గతంలో ఆయన పదవీకాలంను ఏడాది పాటు పొడిగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు చీఫ్ సెలెక్టర్‌గా అతడే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలి పరిణామాలతో పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బీసీసీఐ ఉన్నతస్థాయి అధికారుల నుంచి అగార్కర్‌ను సంప్రదించకపోవడంతో.. ఆయన భవిష్యత్తుపై ఇప్పుడు మరింత అనిశ్చితి నెలకొంది.

వెస్టిండీస్ జట్టు పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టే.. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వన్డే జట్టు ఎంపిక మాత్రం సెలక్షన్ కమిటీకి కీలకంగా మారనుంది. వెస్టిండీస్ సిరీస్ జట్టు ఎంపిక పూర్తయిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాకు ‘థ్యాంక్యూ నోట్’ను అగార్కర్ పంపే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. బీసీసీఐ తనకు మూడేళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయనున్నట్లు అగార్కర్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే అగార్కర్‌ను కొనసాగించబోమని బీసీసీఐ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు.