Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్‌ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?

Fastest T20i Century Sahil Chauhan

Fastest T20i Century Sahil Chauhan

Fastest Century in T20 Internationals: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. గురువారం ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. అభిషేక్ చేసిన 108 పరుగుల్లో ఏకంగా 102 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. 9 ఫోర్ల ద్వారా 36 పరుగులు, 11 సిక్స్‌ల ద్వారా 66 పరుగులు సాధించాడు అంటే.. అఫ్గాన్ బౌలర్లపై కాటేరమ్మ కొడుకు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు.

శాశ్వత సభ్య దేశాల బ్యాటర్లలో అగ్రస్థానం అభిషేక్‌ది:

అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ను చూస్తున్న ప్రేక్షకులకు అసలు ఇది లైవ్ మ్యాచ్‌నా? లేక హైలైట్స్ చూస్తున్నామా? అనే అనుమానం కలిగింది. బంతి ఎక్కడ పడినా బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. అఫ్గాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. పవర్‌ప్లే నుంచే దూకుడుగా ఆడిన అతడు.. ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగిస్తూ 30 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ సెంచరీతో అభిషేక్ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శాశ్వత సభ్య దేశాల బ్యాటర్లలో అత్యంత వేగంగా టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ బ్యాటర్ ఫిల్ అలెన్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా 33 బంతుల్లో సెంచరీలతో ఈ జాబితాలో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌పై 30 బంతుల్లో శతకం చేసిన అభిషేక్.. వారిద్దరినీ వెనక్కి నెట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు.

సాహిల్ చౌహాన్ పేరుపై ప్రపంచ రికార్డు:

అంతేకాదు భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ 35 బంతుల్లో టీ20 అంతర్జాతీయ సెంచరీ చేశాడు. ఇప్పుడు 30 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన అభిషేక్.. హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ మాత్రం కాదు. ఈ జాబితాలో అభిషేక్ మూడో స్థానంలో నిలిచాడు. ఎస్తోనియా బ్యాటర్ సాహిల్ చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తుర్కియే ఆటగాడు ఫహాద్ బల్గేరియాపై 29 బంతుల్లో శతకం చేసి రెండో స్థానంలో ఉన్నాడు. 30 బంతుల్లో సెంచరీతో అభిషేక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకవైపు భారత్ తరఫున కొత్త రికార్డు.. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో టాప్-3లో చోటు.. ఢిల్లీలో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఫాస్టెస్ట్ సెంచరీ టాప్-5 లిస్ట్:

సాహిల్ చౌహాన్ (సైప్రస్‌పై 27 బంతుల్లో సెంచరీ)
ఫహాద్ (బల్గేరియాపై 29 బంతుల్లో శతకం)
అభిషేక్ శర్మ (అఫ్గానిస్థాన్‌పై 30 బంతుల్లో సెంచరీ)
ఫిల్ అలెన్ (దక్షిణాఫ్రికాపై 33 బంతుల్లో శతకం)
సికందర్‌ రజా (గాంబియాపై 33 బంతుల్లో సెంచరీ)