NTV Telugu Site icon

Vostro Accounts: విదేశాలతో రూపాయల్లో వాణిజ్యానికి వోస్ట్రో అకౌంట్లు ఎలా పనిచేస్తాయి?

Vostro Accounts

Vostro Accounts

Vostro Accounts ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ఒకటి.. వోస్ట్రో అకౌంట్లు. వీటినే.. స్పెషల్‌ రూపీ వోస్ట్రో అకౌంట్లు.. SRVA.. అని కూడా అంటారు. ఇతర దేశాలతో చేసే ఎగుమతులు, దిగుమతులకు పేమెంట్లను రూపాయల్లో నిర్వహించటానికి ఇండియా ఈ సరికొత్త ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రారంభించిన ఈ నూతన విధానం పట్ల పలు దేశాలు కూడా ఉత్సాహం కనబరుస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే వోస్ట్రో అకౌంట్లు అనే నయా కాన్సెప్ట్‌ తెర మీదికి వచ్చింది. వోస్ట్రో అకౌంట్‌ అంటే.. విదేశీ బ్యాంకుల కోసం మన దేశంలో బ్యాంకులు మన కరెన్సీతో ఓపెన్‌ చేసే ఖాతాలు అని అర్థం. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ సేవలు అవసరమైన తమ క్లైంట్ల కోసం దేశీయ బ్యాంకులు ఈ అకౌంట్లను వినియోగిస్తాయి. డబ్బులు డిపాజిట్ చేసేందుకు, ట్రాన్స్‌ఫర్ చేసేందుకు, వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, వేరే బ్యాంక్‌ తరఫున డాక్యుమెంట్లు సేకరించేందుకు ఈ ప్రత్యేక ఖాతాలను వాడుకుంటాయి.

Real Story Behind Tech Companies Layoffs: టెక్‌ సంస్థలు స్టాఫ్‌ని నిజంగా ఎందుకు తీసేస్తున్నాయంటే..

దీనివల్ల స్థానిక బ్యాంకులకు ఫారన్‌ ఫైనాన్స్‌ మార్కెట్లలోకి ప్రవేశం లభిస్తుంది. భౌతికంగా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి సేవలందించేందుకు వీలుపడుతుంది. కరెన్సీలను ఉచితంగా మార్చుకొని వాడుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ఈ వోస్ట్రో అకౌంట్లు అదనపు ఏర్పాటు అని చెప్పొచ్చు. పైగా.. దీన్ని ఒక కాంప్లిమెంటరీ వ్యవస్థలాగా కూడా అభివర్ణించొచ్చు. స్పెషల్‌ రూపీ వోస్ట్రో అకౌంట్ల ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి.

ఒకటి.. ఇన్వాయిసింగ్‌. రెండు.. ఎక్స్ఛేంజ్‌ రేట్‌. మూడు.. సెటిల్‌మెంట్‌. మొదటి అంశమైన ఇన్వాయిసింగ్‌ విషయానికొస్తే.. అన్ని ఎగుమతుల, దిగుమతుల విలువలను తప్పనిసరిగా ఇండియన్‌ రూపాయల్లోనే డినామినేట్‌ చేయాల్సి ఉంటుంది. రెండో అంశమైన ఎక్స్ఛేంజ్‌ రేట్‌ విషయానికొస్తే.. రెండు వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల ఎక్స్ఛేంజ్‌ రేట్‌.. మార్కెట్‌ నిర్ణయించిన విలువ మేరకు ఉండాలి. ఇక.. చివరి అంశమైన సెటిల్‌మెంట్‌ విషయానికొస్తే.. ఇది కూడా ఇండియన్‌ రూపాయల్లోనే జరగాలి.

ఇదిలాఉండగా.. ఫారన్‌ కరెన్సీల్లో డీల్‌ చేసేందుకు ప్రత్యేకంగా అనుమతి కలిగిన మన దేశంలో ఆథరైజ్డ్‌ డీలర్‌ బ్యాంకులు మాత్రమే భాగస్వామ్య దేశాల్లోని సంబంధిత బ్యాంకుల కోసం ఇక్కడ వోస్ట్రో అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. స్థానిక దిగుమతిదారులు విదేశాల్లోని సప్లయర్‌లకు పేమెంట్లను ఇండియన్‌ రూపాయల్లో మాత్రమే చేయాలి. అలాగే.. ఇక్కడి ఎగుమతిదారులకు విదేశీయులు సైతం తమ చెల్లింపులను ఇండియన్‌ రూపాయల్లోనే పూర్తిచేయాలి.

ఈ మేరకు మన దేశంలోని భాగస్వామ్య దేశానికి చెందిన సంబంధిత బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి.. అంటే.. వోస్ట్రో అకౌంట్‌ నుంచే ఈ పేమెంట్‌ నిర్వహించాలి. ఎక్స్‌పోర్ట్‌లకు అడ్వాన్స్‌గా పేమెంట్‌ తీసుకోవాలనుకుంటే దేశీయ బ్యాంకులు ముందుగా భాగస్వామ్య దేశంలోని సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి అనుమతి తీసుకోవాలి. ఈ క్రాస్‌ బోర్డర్‌ చెల్లింపులన్నీ విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం-1999కి అనుగుణంగానే జరగాలి.

ఇతర దేశాలు ఇండియాలో వోస్ట్రో అకౌంట్లను ఓపెన్‌ చేయాలనుకుంటే.. ఇక్కడి ఆథరైజ్డ్‌ డొమెస్టిక్‌ డీలర్‌ బ్యాంక్‌ను ముందుగా కాంటాక్ట్‌ అవ్వాలి. అప్పుడు స్థానిక బ్యాంకు కేంద్ర బ్యాంక్‌ నుంచి అనుమతి తీసుకొని ఈ ప్రత్యేక ఖాతాలను తెరుస్తుంది. అయితే.. అంతకన్నా ముందు.. భాగస్వామ్య దేశాల బ్యాంకులు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌లో లేని బ్యాంకులు అనే విషయాన్ని మన దేశంలోని స్థానిక బ్యాంకులు నిర్థారించుకోవాలి.

హైరిస్క్‌ మరియు నాన్‌ కోపరేటివ్‌ అధికార పరిధిలో లేని బ్యాంకులైతేనే వాటి తరఫున ఇక్కడ వోస్ట్రో ఖాతాలు ఓపెన్‌ చేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టాలి. లేదంటే లేదు. ఇండియాలోని ఆథరైజ్డ్ బ్యాంకులు ఒక భాగస్వామ్య దేశానికి చెందిన వివిధ బ్యాంకుల తరఫున ఒకటికి మించి వోస్ట్రో ఖాతాలను తెరవొచ్చు. వోస్ట్రో అకౌంట్ల ఫ్రేమ్‌వర్క్‌.. విదేశీ మారక నిల్వల నికర గిరాకీని.. ముఖ్యంగా.. అమెరికా డాలర్ డిమాండ్‌ని తగ్గించాలని 2022-23 ఆర్థిక సర్వే సూచించింది.

కరౌంట్‌ అకౌంట్‌ సంబంధిత వాణిజ్య సెటిల్‌మెంట్‌ల కోసం ఇవి ఎంతైనా అవసరమని అభిప్రాయపడింది. భారతీయ ఎగుమతిదారులు అడ్వాన్స్‌గా పేమెంట్‌ పొందేందుకు సైతం వోస్ట్రో ఖాతాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. రూపాయల్లో వాణిజ్యం పట్టాలెక్కితే మన కరెన్సీకి అంతర్జాతీయంగా ప్రమోషన్‌ లభిస్తుందని పేర్కొంది. రష్యాకి చెందిన 20 బ్యాంకులు ఇండియాలోని భాగస్వామ్య బ్యాంకులతో కలిసి స్పెషల్‌ రూపీ వోస్ట్రో అకౌంట్లను తెరిచినట్లు ప్రభుత్వ అధికారులు రీసెంట్‌గా తెలిపారు.

దీంతో ఈ ప్రత్యేక ఖాతాలు చర్చనీయాంశంగా మారాయి. వోస్ట్రో అకౌంట్లు తెరిచేందుకు విదేశాలు ముందుకొస్తుండటంతో మన దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఈ మేరకు నోడల్‌ ఆఫీసర్లను ఎంపిక చేసి, వాళ్ల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశాయి. బిల్లుల చెల్లింపుల పరంగా ఎగుమతిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వీరిని అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Show comments