Site icon NTV Telugu

Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు ‘మనుషుల’ తరహాలో అంత్యక్రియలు!

Pet Dog Funeral

Pet Dog Funeral

Pet Dog Funeral: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో, జంతువుల పట్ల కొందరు మనుషులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కపై చూపిన అచంచలమైన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్లు తమతో పాటు ఉన్న కుక్క మరణిస్తే.. కేవలం మట్టిలో పాతిపెట్టడం కాకుండా, ఒక మనిషి చనిపోతే నిర్వహించే అన్ని మతపరమైన ఆచారాలను ఆ కుటుంబం పూర్తి చేసింది.

READ ALSO: Neena Gupta : సెట్‌లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని

ఘనశ్యామ్ దీక్షిత్ అనే వ్యక్తి ఆగ్రాలోని షాహ్దారా బాగ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన 14 ఏళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి కుక్కను పెంచుకోవడానికి తెచ్చుకున్నారు. దానికి ‘టైగర్’ అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ మూగజీవి వారి ఇంట్లో ఒక పెంపుడు జంతువులా కాకుండా, ఆ కుటుంబంలో పెద్ద కొడుకులా కలిసిపోయింది. టైగర్ ప్రతిరోజూ నుదుటిన తిలకం దిద్దుకునేది, అందుకే స్థానికులు దానిని ఆప్యాయంగా “తిలక్‌ధారి టైగర్” అని పిలిచేవారు. గత నెలలో టైగర్ ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించింది. ఆహారం తీసుకోవడం మానేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఖరీదైన చికిత్సను కూడా అందించారు. కానీ వయసు పైబడటం వల్ల జనవరి 28న టైగర్ తుదిశ్వాస విడిచింది. టైగర్ మరణం ఆ కుటుంబాన్ని ఎంతగా కలచివేసిందంటే.. ఘనశ్యామ్ దీక్షిత్ పెద్ద కొడుకు రెండు రోజుల పాటు అన్నం కూడా ముట్టుకోలేదు. ఆ కుటుంబం మొత్తం వారి ఇంట్లో ఒకరు మరణిస్తే ఎంతలా తల్లడిల్లిపోతారో అంతలా బాధపడ్డారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. టైగర్ ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. టైగర్ మరణవార్త విన్న వెంటనే, ఆ చుట్టుపక్కల ఉంటున్న వారందరూ వారి ఇంటికి చేరుకున్నారు. ఆ మూగజీవి మృతదేహానికి నివాళులు అర్పించి, ఆ పరిసరాల గుండా ఒక అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించారు. తరువాత బులంద్‌షహర్‌లోని రాజ్‌ఘాట్‌లో టైగర్ అంత్యక్రియలు జరిపించారు. అంత్యక్రియల అనంతరం టైగర్‌ను పెంచిన కుటుంబ సభ్యులు తల వెంట్రుకలు కత్తిరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీని తరువాత పదమూడవ రోజు కర్మ నిర్వహించారు. టైగర్ ఆత్మ శాంతి కోసం హవనాన్ని నిర్వహించారు. పదమూడు మంది బ్రాహ్మణులను భోజానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఘనశ్యామ్ దీక్షిత్ మాట్లాడుతూ.. “టైగర్ మా ఇంట్లో 14 ఏళ్లు ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయింది. ఆ శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మా ఇంట్లో మనిషి చనిపోతే ఎలా చేస్తామో, అలాగే వాడికి గౌరవంగా వీడ్కోలు పలికాము” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన జంతువుల పట్ల ఉండవలసిన కరుణను, ఆప్యాయతను చాటిచెబుతోంది. ఈ రోజుల్లో కుక్కలను కేవలం కాపలా కోసమో లేదా ఫ్యాషన్ కోసమో పెంచుకునే వారు ఉన్నప్పటికీ, ఆగ్రాలోని ఈ కుటుంబం మాత్రం పెంపుడు జంతువు కూడా కుటుంబంలో భాగమేనని నిరూపించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ ALSO: Sharad Pawar: అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి! క్షీణించిన శరద్ పవార్‌ హెల్త్..

Exit mobile version