Site icon NTV Telugu

Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి వెనకున్న నమ్మకం ఇదే..

Vaikuntha Ekadasi

Vaikuntha Ekadasi

Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అందరూ విష్ణుమూర్తిని దర్శించుకోడానికి ఆలయాల్లో బారులు తీరుతుంటారు. ఈ రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇంతకీ అసలు వైకుంఠ ఏకాదశికి అంటే ఏమిటి, దానికి ఎందుకని అంత ప్రాధాన్యత ఉంది, దీని వెనకున్న నమ్మకాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Unnao Rape Case: ‘అప్పుడే నా తండ్రికి, నాకు న్యాయం జరుగుతుంది’..: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుతూ.. ”వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారమే వైకుంఠ ద్వారం. దేవతల పరంగా చూసుకుంటే, స్వామివారు నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలకు సుప్రభాత దర్శనం ఇస్తారు. దేవకాలంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు చీకటి. ఏడాదంతా ఒక రోజుగా భావిస్తే, రాత్రి తొలగి, పగలు ప్రారంభమయ్యే ముందు, స్వామి వారు దేవతలకు తన దర్శనం ఇస్తారు.” అని చెప్పారు. అందుకే ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు.

వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి భూమి మీదకు వచ్చినందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చినట్లు చెబుతారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు ఉండే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది.

టీటీడీ ప్రచురించిన ఒక పుస్తకంలో వైకుంఠ ఏకాదశి అంటే గుడిలో ఉండే వైకుంఠ ద్వారం ఒక రోజంతా తెరచివుంచే మహోత్సవం అని పేర్కొన్నారు. అలాగే ఈ పుస్తకంలో సంవత్సరానికి ఒకే ఒక్కమారు లభించే మహా భాగ్యం.. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి సేవ అని, మరునాటి ద్వాదశి పుష్కరిణీ చక్రస్నానం అనేక కోట్ల జన్మల పుణ్యఫలమని తెలిపింది. తిరుమలలో ఏడాదికి నాలుగుసార్లు చక్రస్నానం జరుగుతుంది. ఈ నాలుగు సార్లు ఏంటంటే.. అనంత పద్మనాభవ్రతం, బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ఏకాదశి మరునాడు వచ్చే ద్వాదశి రోజున, రథసప్తమి మధ్యాహ్నం.. అని వెల్లడించారు.

శ్రీమహావిష్ణువుని ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షస సమూహానికి శాపవిమోచనం కలిగిందట. నాటి నుంచి విష్ణువును ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారో వారికి తమ లాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులనే రాక్షస సమూహం కోరుకోవడంతో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రాధాన్యత సంతరించుకుందట.

READ ALSO: Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ

Exit mobile version