NTV Telugu Site icon

Top Executives Resignations: పెద్ద సంస్థల్లో పెద్దల రాజీనామాలు.. చేరికలు..

Top Executives Resignations

Top Executives Resignations

Top Executives Resignations: చిన్న ఉద్యోగులు కంపెనీలు మారటం సహజం. కానీ.. 2022లో పెద్ద పెద్ద సంస్థల్లో చాలా మంది పెద్దలు రాజీనామాలు చేశారు. ఉన్న కంపెనీలకు గుడ్‌బై చెప్పి వేరే సంస్థల్లో పెద్ద పోస్టుల్లో జాయిన్‌ అయ్యారు. రిజైన్‌ చేసినవాళ్ల ప్లేసులో కొత్తవాళ్లను తీసుకున్నారు. ఇలా రాకపోకలు జరిగిన నవతరం కంపెనీల జాబితాలో జొమాటో, భారత్‌పే, నైకా, మెటా ఇండియా, వాట్సాప్‌ పే, అమేజాన్‌ ఇండియా, ట్విట్టర్‌, PAYU, మారికో, జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, స్నాప్‌ వంటి సంస్థలున్నాయి.

ఓ వైపు.. స్టార్టప్‌ల్లో నిధులు అడుగంటుతుండటం.. మరో వైపు.. ద్రవ్యోల్బణం మరియు బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతుండటం నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరీ ముఖ్యంగా ఫిన్‌టెక్‌ సంస్థ ‘భారత్‌ పే’లో ఎక్కువగా హైప్రొఫైల్‌ ఎగ్జిట్లు జరిగాయి. కో-ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అష్నీర్ గ్రోవర్‌తోపాటు ఆయన భార్య మాధురీ జైన్‌ గ్రోవర్‌ కూడా ఆ సంస్థను వీడారు. ఆ తర్వాత.. వాళ్లపై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావటం తెలిసిందే.

read more: Non-Tech Sector Hiring: పెరగనున్న వైట్‌ కాలర్‌ ఉద్యోగ నియామకాలు

గ్రోవర్‌ దంపతులు వెళ్లిపోయాక ‘భారత్‌ పే’ CEO సుహైల్‌ సమీర్‌ సైతం తన పదవి నుంచి తప్పుకొని ప్రస్తుతం వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ‘భారత్‌ పే’ కష్టాలు మరింత పెరిగాయి. అంతకు ముందు.. నలుగురు హైలెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు ‘భారత్‌ పే’కి బైబై చెప్పేశారు. ఈ లిస్టులో.. ‘పోస్ట్ పే’ హెడ్.. నెహుల్‌ మల్హోత్రా, CTO.. విజయ్‌ అగర్వాల్‌, CPO.. రజత్‌ జైన్‌, టెక్నాలజీ VP.. గీతాన్షు సింగ్లా ఉన్నారు.

ఈ నలుగురు సొంత బిజినెస్‌లు పెట్టుకునేందుకు తమ పదవుల నుంచి వైదొలిగారని ‘భారత్‌ పే’ వివరణ ఇచ్చింది. ‘భారత్‌ పే’ మాదిరిగానే ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోలోని టాప్‌ లెవల్‌లో కూడా చాలా మంది తమ ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. జొమాటోను ఫస్ట్‌ నుంచీ ముందుండి నడిపించిన కో-ఫౌండర్‌ అండ్‌ CTO గుంజాన్‌ పటీదార్‌ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే సమీర్‌ కూడా జొమాటోకి టాటా చెప్పారు. వీళ్లిద్దరి కన్నా ముందు జొమాటోకి మరో కోఫౌండర్‌ మోహిత్‌ గుప్తా ఝలక్‌ ఇచ్చారు.

ఈయనకుతోడు.. న్యూ ఇనీషియేటివ్స్‌ హెడ్‌ రాహుల్‌ గంజూ మరియు గ్లోబల్‌ గ్రోత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ జవార్‌, డిప్యూటీ CFO నితిన్‌ సవర సైతం జొమాటోకి రాంరాం చెప్పేశారు. ఆన్‌లైన్‌ బ్యూటీ రిటైలర్‌ నైకా CFO అర్వింద్‌ అగర్వాల్‌ రాజీనామా చేసి PAYU సంస్థలో ఇండియా విభాగానికి CFOగా జాయిన్‌ అయ్యారు. ఇదిలాఉండగా.. కొన్ని నవతరం సంస్థలు మేజర్‌ కంపెనీల నుంచి టాప్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లను తమ వైపుకి తిప్పుకోగలిగాయి.

మారికో కంపెనీ ఇండియా విభాగం ఫైనాన్స్‌ హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ను సుగర్‌ కాస్మెటిక్స్‌ సంస్థ తమ CFOగా నియమించింది. అమేజాన్‌ ఇండియాలోని గ్రాసరీ, ఫుడ్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ సమీర్‌ ఖేతర్‌పాల్‌ తన పదవికి రాజీనామా చేసి జూబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ CEOగా చేరారు. మెటా ఇండియా కంట్రీ హెడ్‌ పోస్టు నుంచి తప్పుకున్న అజిత్‌ మోహన్‌.. ఆ సంస్థకు పోటీదారైన స్నాప్‌ కంపెనీలో ఆసియా పసిఫిక్‌ విభాగానికి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ మరియు మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ కూడా రిజైన్‌ చేశారు. అనంతరం.. రాజీవ్‌ అగర్వాల్‌.. శామ్‌సంగ్‌ ఇండియాలో జాయిన్‌ అయ్యారు. వాట్సాప్‌ పే డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ మనేశ్‌ మహాత్మే రాజీనామా చేసి అమేజాన్‌ ఇండియాలో ప్రొడక్ట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగం డైరెక్టర్‌గా పగ్గాలు చేపట్టారు. ట్విట్టర్‌ CEO పరాగ్‌ అగర్వాల్‌ సైతం తన ఉద్యోగానికి నమస్కారం పెట్టిన సంగతి తెలిసిందే.