NTV Telugu Site icon

Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్‌ లేఆఫ్‌లు

Yznkllnj34e Hd

Yznkllnj34e Hd

Tech Layoffs to Continue: 2022 జనవరిలో లేఆఫ్‌ అనే పదాన్ని గూగుల్‌లో ఐదుగురు మాత్రమే సెర్చ్‌ చేయగా.. ఈ సంవత్సరం జనవరిలో ఏకంగా వంద మంది సెర్చ్‌ చేశారు. అంటే.. ఏడాది వ్యవధిలోనే లేఆఫ్‌ అనే వర్డ్‌ ఎంత పాపులర్‌ అయిందో అర్థంచేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం కూడా కలిగించకపోవచ్చేమో.

ఎందుకంటే.. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా లేఆఫ్‌ అనే పదమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. కంపెనీలు ఆ రేంజ్‌లో ఉద్యోగులను తొలగిస్తుండటమే అందుకు కారణం. ఒక వైపు.. ఉన్న ఉద్యోగాలు పోతుంటే మరో వైపు.. కొత్త జాబులు దొరికే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో.. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఒక నౌకరీ చేద్దామనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నపళంగా లేఆఫ్‌కి గురవుతున్నవాళ్లు ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

RBI: ఆర్బీఐని ఆపటం కష్టమేనంటున్న నిపుణులు. చివరికి అదే నిజమైంది

‘‘నాకు ఏదైనా జాబుంటే చూడు తమ్ముడు..’’ అని అక్షరాలా అడుగుతున్నారు. ఒకవేళ మీరు నాకు జాబు చూడలేని స్థితిలో ఉంటే గనక నేను పెట్టిన ఈ సోషల్‌ మీడియా పోస్టును షేర్‌ చేయండి. మీ స్పందనను తెలియజేస్తూ కామెంట్‌ పెట్టండి. తద్వారా నా సిచ్యువేషనేంటో మరింత మందికి తెలుస్తుంది అంటూ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కోరుకున్న కొలువే సొంతం కావాలంటే కష్టమని, అందువల్ల కొన్నాళ్లపాటు వేరే సెక్టార్లలో సర్దుకుపోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇప్పుడు చోటుచేసుకుంటున్న లేఆఫ్‌లను ట్యాలెంట్‌ అడ్జస్ట్మెంట్లుగా భావించాలని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో టెక్‌ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోతున్నాయని, కీలకమైన ప్రాజెక్టులేమైనా ఉంటేనే రిక్రూట్మెంట్లు సెలెక్టివ్‌గా జరుగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ మరికొంత కాలం కొనసాగే సూచనలున్నాయని పేర్కొంటున్నారు.

టెక్‌ కంపెనీలతోపాటు స్టార్టప్‌ సంస్థల్లో కూడా హైరింగ్‌లకు మరియు మ్యాన్‌పవర్‌ రిక్వైర్‌మెంట్లకు సంబంధించి చిన్న క్లూ అయినా బయటికి రావట్లేదని సీనియర్‌లు సైతం వాపోతున్నారు. టెక్నాలజీ సెక్టార్‌ ఒక్కటే కాదు. టెలీకమ్యూనికేషన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మరియు రిటైల్‌ రంగాలు కూడా ఆర్థికమాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ తీసివేతల జాబితాలో చేరిపోవాల్సి వస్తోంది.

లేఆఫ్‌ల విషయంలో ఉద్యోగుల పనితీరుకు బదులుగా ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కంపెనీకి వీళ్ల అవసరం ఇక ఉండబోదు అనుకున్నవాళ్లను సామూహికంగా తొలగించడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సంస్థ లాభదాయకతను మరియు భవిష్యత్తులో వ్యాపార అవకాశాన్ని మెరుగుపరచటానికి కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నారు. దీనికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు.

అదే సమయంలో.. లేఆఫ్‌ల పట్ల ఒక్కో కంపెనీ తనదైన ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతోంది. చాలా సంస్థలు.. ముఖ్యంగా.. ఖర్చులు తగ్గించుకోవటం మరియు అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగించుకోవటం వంటి విధానాలకు పాల్పడుతున్నాయి. నియామకాలను తగ్గించటం, కంపెనీ బడ్జెట్‌లో కోతలు, మేనేజ్‌మెంట్‌ మారటాలు సైతం లేఆఫ్‌లకు దారితీస్తున్నాయి. ఏదైనా సంస్థ.. ఫలానా ప్రాజెక్టులను లేదా డిపార్ట్మెంట్‌లను కుదించుకోవాలని అనుకుంటోందంటే అది లేఆఫ్‌లకు సంకేతంగానే లెక్కలోకి తీసుకోవాలి.

లేఆఫ్‌ రూమర్లు వచ్చినా, అన్‌పెయిడ్‌ లీవ్స్‌ తీసుకోవాలని స్టాఫ్‌ని మేనేజ్మెంట్‌ కోరినా అది కూడా లేఆఫ్‌కి సూచనగానే భావించాలి. కంపెనీలు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోతున్నా.. బిజినెస్‌లో డౌన్‌ అవుతున్నా.. లేఆఫ్‌లకు పూనుకుంటాయి. అయితే.. టెక్‌ సెక్టార్‌లో నియామకాల మందగమనం వల్ల నాన్‌ టెక్‌ సెక్టార్లలో ట్యాలెంట్‌కి డిమాండ్‌ నెలకొంటోంది. తమ డొమైన్‌లో కాకుండా వేరే డొమైన్‌లో పనిచేసే ఆసక్తి, చురుకుదనం, అనుకూలత ఉన్నవారికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.

కానీ.. కొన్ని కంపెనీలు ఆర్థికమాంద్యం వంకతో ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాల్లో ఉన్న సంస్థలు సైతం ‘‘నలుగురితో నారాయణ’’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయని, ఒకటీ రెండు నెలల్లోనే పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయినట్లు, సంపద మొత్తం దొంగల దోపిడీకి గురైనట్లు షోయింగ్‌ చేస్తున్నాయని తప్పుపడుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ సంవత్సరం.. ముందుంది ముసుర్ల పండగ అన్నట్లు కనిపిస్తోంది.