NTV Telugu Site icon

Startups Fundraising: 8 నెలల కనిష్టానికి ఫండ్‌ రైజింగ్‌

Startups Fundraising

Startups Fundraising

Startups Fundraising: సొంతగా వ్యాపారం చేయాలనే ఆలోచనలైతే దండిగా ఉన్నాయి కానీ.. అవి ఆచరణలోకి రావటానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు కనిపించట్లేదు. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్‌ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుక రాలేకపోతున్నారు. దీంతో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. గత నెల ఫిబ్రవరిలో స్టార్టప్‌ల ఫండ్‌రైజింగ్‌ 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందటితో పోల్చితే ఏకంగా 83 శాతం తగ్గిపోయింది.

2022 ఫిబ్రవరిలో 103 డీల్స్‌ కుదరగా ఆ సంఖ్య 2023 ఫిబ్రవరిలో 35కి దిగొచ్చింది. పోయినేడాది ఫిబ్రవరిలో 3 పాయింట్‌ 6 బిలియన్‌ డాలర్ల ఫండ్‌రైజింగ్‌ జరగ్గా ఈసారి ఫిబ్రవరిలో కనీసం ఒక బిలియన్‌ డాలర్ల నిధులు కూడా సమకూరలేదు. అందులో సగం.. అంటే.. 596 మిలియన్‌ డాలర్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్‌ క్యాపిటలిస్టులు ఎక్కువ శాతం ఫిన్‌టెక్‌ మరియు ఫుడ్‌ స్టార్టప్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

read more: National Retail Trade Policy: సరికొత్త జాతీయ విధానం

గత నెలలో దాదాపు 60 శాతం ఇన్వెస్ట్‌మెంట్లు ఫిన్‌టెక్‌ మరియు ఫుడ్‌ స్టార్టప్‌లకే దక్కాయి. ఈ విషయాలను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. అయితే.. స్టార్టప్‌లకు ఫండ్‌రైజింగ్‌ పడిపోవటం కొత్త కాదు. కిందటి ఏడాది 2వ అర్ధ భాగంలో కూడా ఇదే చోటుచేసుకుంది. 2022 జనవరి నుంచి జూన్‌ వరకు సుమారు 20 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ జరగ్గా జులై నుంచి డిసెంబర్‌కి వచ్చేసరికి 5 పాయింట్‌ 4 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది.

క్రితం సంవత్సరం మొదటి 6 నెలల్లో స్టార్టప్‌లకు నెలకి కనీసం 3 బిలియన్‌ డాలర్ల చొప్పున డబ్బులు పుట్టాయి. చివరి 6 నెలల్లో నెలకి 900 మిలియన్లు రావటమే గగనమైంది. ఇదిలా ఉండగా.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫండ్‌రైజింగ్‌ చేసిన సంస్థల జాబితాలో 6 ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు ఉన్నాయి. ఇన్సూరెన్స్‌ దేఖో, ఫోన్‌పే, మింటోక్, స్టేబుల్‌ మనీ, లోన్‌ట్యాప్‌, లోన్‌ కుబేర్‌ వంటి కంపెనీలు 280 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించగలిగాయి.

మరో వైపు.. ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండ్స్‌లో కూడా మార్పులు వచ్చాయి. గతేడాది 66 శాతం పెట్టుబడులు ఫిన్‌టెక్‌ సంస్థల నుంచి రుణ వ్యాపారాల వైపుకి మరలిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 63 శాతం ఇన్వెస్ట్‌మెంట్లు పేమెంట్‌ గేట్‌వే సొల్యూషన్లను అందించే ఫన్‌టెక్‌ కంపెనీలకు దక్కాయి. నిధుల సమీకరణలో రెస్టారెంట్‌ మరియు ఫుడ్‌ బిజినెస్‌లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. ఫ్రెష్‌ టు హోం అనే సంస్థ ఒక్కటే 104 మిలియన్‌ డాలర్ల ఫండ్‌రైజింగ్‌ చేయగలిగింది.

అమేజాన్‌ సంభవ్‌ వెంచర్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో జరిగిన సిరీస్‌-డి ఫండ్‌రైజింగ్‌ రౌండ్‌లో ఫ్రెష్‌ టు హోమ్‌ ఈ నిధులను సొంతం చేసుకుంది. వీటితో 100 రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనుంది. ఇ-కామర్స్‌, ఎడ్‌టెక్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్‌ మరియు ఇతర కేటగిరీ స్టార్టప్‌లన్నీ కలిసి 212 మిలియన్‌ డాలర్ల ఫండ్‌రైజ్‌ చేసినట్లు మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ తన నివేదికలో వివరించింది.