NTV Telugu Site icon

Special Story on Walmart and Ikea: వారెవ్వా.. వాల్‌మార్ట్‌! వహ్‌వా.. ఐకియా!!

Special Story On Walmart And Ikea

Special Story On Walmart And Ikea

Special Story on Walmart and Ikea: రిటైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు వాల్‌మార్ట్‌ మరియు ఐకియా. ఈ రెండు సంస్థలు ఇండియాలో మొండిగా ముందుకెళుతున్నాయి. భారీగా నష్టాలొస్తున్నా భరిస్తామంటున్నాయి. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలనే నిర్ణయించుకున్నాయి. వాటి పట్టుదలకు తగ్గట్లే సేల్స్‌ పెరుగుతున్నాయి. కానీ.. లాభాల్లోకి రాలేకపోతున్నాయి. గతేడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవి అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంపై మరిన్ని వివరాలు..

వాల్‌మార్ట్‌ గ్రూప్‌ సంస్థలు మన దేశంలో మూడున్నాయి. ఒకటి.. ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్‌. రెండు.. మింత్రా. మూడు.. వాల్‌మార్ట్‌ ఇండియా. ఈ మూడు కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్.. పేరుకు తగ్గట్లే ఇ-కామర్స్‌ మార్కెట్‌ ప్లేస్‌గా వ్యవహరిస్తోంది. వాల్‌మార్ట్‌ ఇండియా.. ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఇక.. మింత్రా గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. వాల్‌మార్ట్‌తోపాటు ఐకియా కూడా ఇండియాలో గతేడాది భారీగా నష్టాలను మూటగట్టుకుంది.

విక్రయాలు పెరిగినప్పటికీ లాభాల బాట పట్టలేకపోతున్నాయి. దీంతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వాల్‌మార్ట్‌ గ్రూపు సంస్థల రెవెన్యూలో 45 శాతం వృద్ధి నెలకొన్నా గానీ ఖర్చులు తడిసిమోపెడవటంతో 40 నుంచి 50 శాతం వరకు నష్టాలను నమోదుచేశాయి. ఆర్డర్ల డెలివరీ, అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రమోషన్లు వంటివాటికి అధికంగా నిధులను కేటాయించాల్సి వస్తోంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐకియా సంస్థ ఆదాయం 77 శాతం గ్రోత్‌ అయినప్పటికీ నికర నష్టం 12 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి సమర్పించిన వివరాలను బట్టి తెలుస్తోంది. బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ సైతం ఇదే చెబుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రెండు గ్రూపులు మన దేశంలో ఏమాత్రం వెనకడుగు వేసే ఆలోచనల్లో లేకపోవటం ఆసక్తి కలిగిస్తోంది. పైగా.. ఇతర సంస్థలను అక్వైర్‌ చేసుకునేందుకు ఉత్సాహపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాల్‌మార్ట్‌, ఐకియా ధైర్యమేంటి? ఎందుకిలా ముందుకు వెళుతున్నాయనేదానిపై నిపుణులు విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇండియన్‌ మార్కెట్‌లో రానున్న రోజుల్లో లీడర్‌గా నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు లాభాలను త్యాగం చేయాల్సిందేనని కన్సల్టింగ్‌ కంపెనీ థర్డ్‌ ఐసైట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దేవాంగ్షు దత్త అన్నారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా స్వల్ప కాల నష్టాలను భరించాలన్న ఈ వ్యాపార వ్యూహం వల్ల వాల్‌మార్ట్‌, ఐకియాలకు తప్పకుండా లాభాలను తెచ్చిపెడుతుందని తెలిపారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ మార్కెట్‌లో గతేడాది తీవ్రమైన పోటీ నెలకొనటంతో నష్టాలు మిగిలాయని దత్త గుర్తు చేశారు. ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కి సంబంధించి గత ఆర్థిక సంవత్సర ఫలితాలను వాల్‌మార్ట్‌ ప్రకటించాల్సి ఉంది. ఈ కంపెనీ.. అంతకు ముందు సంవత్సరం 7 వేల 840 కోట్ల రెవెన్యూని నమోదుచేసింది. ఫర్నీచర్‌ మరియు హోం డెకరేషన్‌ స్టోర్‌.. ఐకియా.. 2021-22లో కంపెనీ ఆపరేషన్స్‌ ద్వారా వెయ్యీ 76 కోట్ల రూపాయల రెవెన్యూ పొందింది.

అదే సమయంలో 902 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్‌ సంస్థకు వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతోంది. విక్రేతల వద్ద వసూలు చేసే ప్లాట్‌ఫామ్‌ ఫీజుతోపాటు షిప్పింగ్‌ సర్వీసుల ఫీజు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా వచ్చే రెవెన్యూ.. ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్‌కి ప్లస్‌ పాయింట్లుగా మారాయి. వీటన్నింటిలోనూ మార్కెట్‌ ప్లేస్‌ సర్వీసుల నుంచి పొందే మార్జిన్లదే మెజారిటీ షేరు అని చెప్పొచ్చు. వాల్‌మార్ట్‌కి ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాడ్‌ రెవెన్యూలో మన దేశమే టాప్‌లో నిలవటం విశేషం.

వాల్‌మార్ట్‌ ఇండియాకి 28 క్యాష్‌ అండ్‌ క్యారీ హోల్‌సేల్‌ స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్ల రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం జంప్‌ కాగా నెట్‌ లాస్‌ మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 49 శాతానికి ఎగబాకింది. ఫ్యాషన్‌ మార్కెట్‌ ప్లేస్‌ మింత్రాను నిర్వహించే మింత్రా డిజైన్‌ అనే సంస్థకు కూడా తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు జరిపే కంపెనీలు, బ్రాండ్ల నుంచి కమిషన్లు, సర్వీస్‌ ఛార్జ్‌ రూపంలో ఆదాయం వస్తోంది. కానీ.. ప్రాఫిట్స్‌ అందని ద్రాక్షగా మారాయి. రిలయెన్స్‌ జియో మాదిరిగానే వాల్‌మార్ట్‌, ఐకియా కూడా.. ముందు నష్టపోవాలి తర్వాత లాభపడాలి అనే వాణిజ్య సూత్రాన్ని పాటిస్తుండటం ఇండియాకి ఎంతో గర్వకారణం.