NTV Telugu Site icon

Special Story on Use of cash: ‘‘ఫీల్‌ మై క్యాష్‌’’ అంటే ఏంటో తెలుసా?

Special Story On Use Of Cash

Special Story On Use Of Cash

Special Story on Use of cash: ‘ఫీల్ మై క్యాష్’ అనే కాన్సెప్ట్ గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లయినా.. డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నా.. జనం ఇప్పటికీ రికార్డు లెవల్లో క్యాషే వాడుతున్నారు. కారణమేంటంటే ‘పర్సనల్‌’ అంటున్నారు. ఆర్య సినిమాలోని ‘ఫీల్ మై లవ్’ అనే పాట మాదిరిగా ‘ఫీల్ మై క్యాష్’ అని చెబుతున్నారు. డబ్బు.. బ్యాంక్‌ ఖాతాలో ఉండటం వేరు, చేతిలో ఉండటం వేరు అని పేర్కొంటున్నారు. ‘ఫీల్‌ మై క్యాష్‌’ అంటే డబ్బు మన దగ్గర ఉండటమేనని చెబుతున్నారు.

మన దేశంలో క్యాష్‌కి ఇంత డిమాండ్‌ ఎందుకుందంటే.. ‘పర్సనల్‌’.. అనేది కూడా ఒక కారణమేనని చెప్పొచ్చు. చేతిలో గానీ జేబులో గానీ డబ్బు ఉంటే పేమెంట్‌ను వెంటనే చేసేయొచ్చు. అదే.. ఫోన్‌లో ఉంటే.. చెల్లింపులు చేసే సమయంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. మొబైల్‌కి సిగ్నల్స్‌ అందకపోవచ్చు. డేటా అయిపోవచ్చు. లేకపోతే.. క్యూఆర్‌ కోడ్ పనిచేయకపోవచ్చు. మర్చెంట్లు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ని స్వీకరించకపోవచ్చు. క్యాషే కావాలని అడగొచ్చు. మొబైల్‌ పేమెంట్స్‌ చేయాలనుకుంటే ఇన్ని ఇబ్బందులున్నాయి. ఇవి ‘ఫీల్‌ మై క్యాష్‌’ అనే కాన్సెప్ట్‌ని బ్రేక్‌ చేస్తాయి.

read more: Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్‌ వేళ.. ఇండియాలో హైరింగ్‌ హేల..

పెద్ద నోట్లు రద్దయి ఆరు నెలలు అవుతున్నా మన దేశంలో చెలామణిలో ఉన్న నగదు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో డీమానెటైజేషన్‌ ప్రక్రియ.. లక్ష్యాన్ని చేరటంలో విఫలమైందనే అభిప్రాయం నెలకొంది. పాత నోట్లను ఉన్నపళంగా క్యాన్సిల్‌ చేయటం వల్ల వాటిని ఇచ్చేసి కొత్త నోట్లను తీసుకోవటానికి లక్షల సంఖ్యలో జనం పడ్డ ఇబ్బందులు నిజంగా వర్ణణాతీతం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా అమలుచేసిన ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను ఎంతగానో కుంగదీసింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మన దేశంలో క్యాష్‌ వాడకం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ అనే కమ్యూనిటీ లెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఒక సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 342 జిల్లాల్లో దాదాపు 32 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. స్టడీలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది.. గత ఏడేళ్లలో తాము కొనుగోలు చేసిన ఆస్తులకు పాక్షికంగా నగదు రూపంలోనే పేమెంట్లు చేసినట్లు చెప్పారు. ఆస్తుల లావాదేవీల్లో సంస్కరణలు జీరో అని, అందుకే లంచాలు, అవినీతి ప్రబలంగా ఉన్నాయని విమర్శించారు.

ఆస్తుల యజమానులు పన్నులను పూర్తిగా చెల్లించకుండా తప్పించుకునేందుకు ల్యాండ్‌ లేదా ప్రాపర్టీ లావాదేవీని నగదు చెల్లింపుల ద్వారానే పూర్తిచేస్తున్నారు. ఈ నెల 21వ తేదీతో ముగిసిన పక్షం రోజుల్లో.. ప్రజల చేతిలో ఉన్న నగదు రికార్డు స్థాయిలో 30 పాయింట్‌ ఎనిమిదీ ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైంది. ఈ డేటాను స్వయంగా ఆర్బీఐ విడుదల చేసింది. 2016 నవంబర్‌ 4తో పోల్చితే ఇది ఏకంగా 72 శాతం ఎక్కువ. ఆరేళ్ల కిందట వాడకంలో ఉన్న నగదు దాదాపు 18 లక్షల కోట్లు మాత్రమే. మన దేశంలో నగదు వాడకం పెరగటానికి మరో కారణం కూడా ఉంది.

రెండేళ్ల క్రితం కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించటంతో పబ్లిక్‌ పదే పదే క్యాష్‌ కోసం ఏటీఎంల వద్దకు వెళ్లలేక ఒక్కసారే అధిక మొత్తంలో నగదు తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు. ఇది ఆటోమేటిగ్గా సర్క్యులేషన్‌లో ఉన్న క్యాష్‌ పెరగటానికి దారితీసింది. గ్రామీణ జిల్లాల్లోని, చిన్న పట్టణాల్లోని ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకి నగదు చెల్లింపులే చేసేవారు. కొవిడ్‌ వెలుగులోకి వచ్చిన కొత్తలో వాళ్లు ఆన్‌లైన్‌ పేమెంట్ల వైపు మొగ్గుచూపలేదు. ప్రస్తుతం ప్రజలు నగదును ఎక్కువగా వాడుతున్నారంటే డిజిటల్‌ పేమెంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందనుకోవటానికి లేదు.

ఎందుకంటే.. ఇటీవలి కాలంలో డిజిటల్‌ పేమెంట్లు క్రమంగా పెరుగుతున్నాయే తప్ప పడిపోవటం అనేది లేదు. లావాదేవీల సంఖ్యలో గానీ లావాదేవీల విలువలో గానీ తగ్గుదల కనిపించట్లేదు. అదే సమయంలో.. చెలామణిలో ఉన్న నగదు మరియు జీడీపీ నిష్పత్తిలో సైతం వృద్ధి నెలకొంటోంది. ఓవరాల్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ వల్ల ఇది సాధ్యపడుతోంది. 2019లో ఆర్బీఐ విడుదల చేసిన డిజిటల్‌ పేమెంట్ల డాక్యుమెంటే ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. నిర్దిష్ట కాల వ్యవధిలో డిజిటల్ చెల్లింపులు మరియు GDP నిష్పత్తిలో పెరుగుదల దేశ కరెన్సీ మరియు GDP నిష్పత్తిలో తగ్గుదలను సూచించదని RBI తెలిపింది.