NTV Telugu Site icon

Special Story on Sundar Pichai: ‘‘గూగుల్ తల్లి’’ ముద్దుబిడ్డ.. ‘‘బహుత్ సుందర్’’ పిచాయ్..

Special Story On Sundar Pichai

Special Story On Sundar Pichai

Special Story on Sundar Pichai: ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలియని ఏ విషయాన్నైనా అడిగేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముందుగా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లినే కన్న కొడుకు సుందర్ పిచాయ్. ప్రపంచంలోని పవర్ ఫుల్ కంపెనీ గూగుల్‌కి సీఈఓ అయిన మొట్టమొదటి నల్లజాతీయుడు, భారతీయుడు ఈయనే కావటం మనకు గర్వకారణం. సెర్చింజన్లలో గూగుల్ ఒక దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలో సుందర్‌ పిచాయ్‌ కీలక పాత్ర పోషించారు. పిచాయ్ సార్.. మీరు సూపర్.. అంటూ ఇటీవల నెటిజన్ల ప్రశంసలు అందుకున్న ఆయనే ఇవాళ మన డిఫైనింగ్ పర్సనాలిటీ.

సుందర్ పిచాయ్ అసలు పేరు పి.సుందర రాజన్. అమెరికా వెళ్లాక తన పేరులోని సుందర రాజన్‌ను కుదించుకొని సుందర్ గా, ఇంటి పేరు ‘పి’ని పొడిగించుకొని పిచాయ్‌గా మార్చుకున్నారు. ఆ విధంగా సుందర్‌ పిచాయ్‌ అయ్యారు. అలాగే.. తన సారథ్యంలో గూగుల్ సంస్థ భవిష్యత్తును సమూలంగా తిరగరాశారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టి పెరిగిన సుందర్ పిచాయ్.. ఇంటర్ వరకు అక్కడే చదివారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ పట్టా అందుకొని అగ్రరాజ్యం అమెరికా వెళ్లి ఎంఎస్, ఎంబీఏ పూర్తి చేశారు. చదువు అయిపోయాక రెండేళ్లపాటు మెకిన్సే మరియు అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో పనిచేశారు. 2004లో గూగుల్‌ సంస్థలోకి ప్రొడక్ట్ మేనేజర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

read more: Reliance Industries-Naphtha Sale: రష్యా నుంచి అరుదుగా భారీఎత్తున కొన్నదేంటి?

ఏడాది తిరిగే సరికి గూగుల్ మ్యాప్స్‌ని లాంఛ్ చేశారు. ఆ సంస్థలో ఇప్పుడు వంద కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉండటం విశేషం. మూడేళ్ల తర్వాత.. అంటే.. 2008లో సుందర్‌ పిచాయ్‌ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ సమయంలో గూగుల్ క్రోమ్ నేలచూపులు చూస్తోంది. ఖర్చులు, కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతోంది. దీంతో సుందర్ పిచాయ్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు.

ఫలితంగా గూగుల్ క్రోమ్ ఇప్పుడు 64 పాయింట్ 5 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకోవటం చెప్పుకోదగ్గ విషయం. 2014లో సుందర్ పిచాయ్ గూగుల్ యాప్స్ బాధ్యతలను సైతం స్వీకరించారు. సంవత్సరం తర్వాత ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ హెడ్ కూడా అయ్యారు. ఆండ్రాయిడ్‌ యూజర్ల సంఖ్యను 23 లక్షల నుంచి ఏకంగా వంద కోట్లకు పెంచి ఔరా అనిపించారు.

సుందర్ పిచాయ్ ట్యాలెంట్‌ని గుర్తించిన మైక్రోసాఫ్ట్ మరియు ట్విట్టర్ ఆయనకు తమ సంస్థల్లో సీఈఓ పోస్టును ఆఫర్ చేశాయి. అయినప్పటికీ సుందర్‌ పిచాయ్‌ వాటిని తిరస్కరించి గూగుల్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు. దీంతో.. కంపెనీ కోసం ఆయన చూపిన విశ్వసనీయతను, కెరీర్‌ విషయంలో చేసిన త్యాగాన్ని సంస్థ గుర్తించి 2015లో అదే సీఈఓ పొజిషన్‌కి ప్రమోషన్ ఇచ్చి గౌరవించింది.

అంతేకాదు. ఆ తర్వాత సంవత్సరం గూగుల్‌తోపాటు ఆ సంస్థకు పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబేట్‌లో 19 లక్షల 90 వేల డాలర్ల విలువ చేసే షేర్లను బహూమతిగా ఇచ్చింది. సుందర్ పిచాయ్ 2017లో మన దేశంలో తేజ్ పేరుతో యూపీఐ పేమెంట్ల ప్లాట్‌ఫాంని ప్రారంభించారు. ఆ యాప్‌ని లాంఛ్ చేసిన 2 నెలల్లోపే 3 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది.

అనంతరం తేజ్ పేరును ‘గూగుల్ పే’గా రీబ్రాండ్ చేశారు. సుందర్ పిచాయ్ 2019లో ఆల్ఫాబేట్‌ సీఈఓ గానూ బాధ్యతలు చేపట్టి ఐటీ ఇండస్ట్రీలో అత్యధిక వేతనం తీసుకునే అధినేతగా పేరొందారు. ఆయన సేవలకు భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

సుందర్‌ పిచాయ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఇండియా గెలిచాక సామాజిక మాధ్యమంలో ఆయన పెట్టిన పోస్టింగ్ చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌ అభిమాని ట్రోల్‌ చేయాలని ప్రయత్నించగా సుందర్‌ పిచాయ్‌ దీటుగా బదులిచ్చారు. దీంతో నెటిజనం ‘‘పిచాయ్ సార్.. మీరు సూపర్’’ అంటూ ప్రశంసలు కురిపించారు.