Special Story On Patanjali: ప్రకృతి ఆశీర్వాదమే పతంజలి ఆయుర్వేదం అనే ఆకట్టుకునే నినాదంతో ప్రజాదరణ పొందిన సంస్థ పతంజలి. దీన్ని.. యోగా గురు బాబా రామ్‌దేవ్ 1995లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభించారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో అతితక్కువ కాలంలో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పింది. ఒకానొక దశలో అత్యంత ప్రభావశీల కంపెనీల సరసన చేరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ల తర్వాత 4వ స్థానాన్ని ఆక్రమించింది. అయితే.. ఈ విజయపరంపరను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఐదేళ్ల కిందటే ఈ అరుదైన ఘనత సాధించిన పతంజలి ఈమధ్య బాగా వెనకబడింది. ఈ నేపథ్యంలో దీనికి దారితీసిన కారణాలేంటో చూద్దాం.
ఐదేళ్ల కాలంలోనే పతంజలి సంస్థ అనూహ్యంగా విస్తరించింది. 50 ఉత్పత్తుల స్థాయి నుంచి ఏకంగా వెయ్యికి పైగా ప్రొడక్టులను రూపొందించే రేంజ్‌కి ఎదిగింది. 2011-17 మధ్య కాలంలో 10 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ను సొంతం చేసుకుంది. రీసెంట్‌గా ఐపీఓకి కూడా వచ్చింది. తద్వారా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశిస్తోంది. పతంజలి తొలినాళ్లలో ఎక్కువగా ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టులపైనే ఆధారపడింది. ఉత్పత్తులకు హెర్బల్ టచ్ ఇచ్చి సక్సెస్ అయింది. పతంజలి తయారుచేసిన దంత్‌కాంతి టూత్‌పేస్టు.. ఈ రంగంలో జైంట్ కంపెనీలైన కోల్గెట్ మరియు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లకే ఛాలెంజ్ విసిరింది.
చివరికి అవి కూడా పతంజలి మాదిరిగా తమ టూత్‌పేస్టులకు న్యాచురల్ ఫ్లేవర్‌ని ప్రయోగాత్మకంగా పరీక్షించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విజయంతో పతంజలి శరవేగంగా విస్తరణ చేపట్టింది. హైజీన్ మరియు పర్సనల్ కేర్ కేటగిరీలు మొదలుకొని ఫుడ్ ప్రొడక్ట్స్ విభాగంలోకి సైతం అడుగు పెట్టింది. కానీ.. ఈ క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. విస్తరణపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ తలెత్తాయి. ట్రాన్స్‌పోర్టర్లతో లాంగ్ టర్మ్ కాంట్రాక్టులు కుదుర్చుకోవటం వల్ల డిస్ట్రిబ్యూషన్ ఛానల్‌పై ఒత్తిడి పెరిగింది. స్టాక్స్ మెయిన్‌టెయిన్ చేయలేక స్టోర్లు సతమతమయ్యాయి.
సరిపోను సరుకు లేకపోవటంతో వినియోగదార్లు చివరికి వేరే బ్రాండ్ల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఫలితంగా 2018 ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆదాయం 10 శాతం పడిపోయింది. హెర్బల్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి ప్రధాన పోటీదారులు రంగ ప్రవేశం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కన్జ్యూమర్ల ఖర్చుల తీరు మారింది. సేల్స్ ట్యాక్స్ కారణంగా ఇన్‌పుట్ కాస్ట్, ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఇవి కూడా పతంజలి బిజినెస్ పడిపోవటానికి కారణమయ్యాయి. 2020 మరియు 21 ఆర్థిక సంవత్సరాల్లో పతంజలి ఆయుర్వేద టర్నోవర్ నామమాత్రంగా సుమారు 8 శాతమే పెరిగింది. ఈ సంస్థ టర్నోవర్ గ్రోత్ గతంలో ఎప్పుడూ ఇంత తక్కువగా నమోదు కాలేదు.
గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రతికూల ఫలితాలను చూశాక పతంజలి.. నష్టనివారణ చర్యలను చేపట్టింది. ఇప్పుడు భారీ ఐపీఓ ప్రణాళికలను అమలుచేస్తోంది. రానున్న ఐదేళ్లలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఫుడ్ బిజినెస్ మొత్తాన్ని పతంజలి ఆయుర్వేద సంస్థ నుంచి రుచి సోయ ఇండస్ట్రీస్ కిందికి మారుస్తోంది. భవిష్యత్తులో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన వ్యాపారాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం మరియు క్లారిటీ కోసమే ఈ ఆలోచన చేసింది. పతంజలి గతంలో హడావుడిగా వ్యాపార విస్తరణ చేపట్టి చేతులు కాల్చుకున్న చేదు అనుభవం నుంచి ఈ పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పొచ్చు. పొరపాట్లను సరిచేసుకొని మన దేశ ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లో లీడర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.